TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో లీగల్ ఏఐ స్టాక్ అమలు: తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవంలో చంద్రబాబు ప్రకటన.!

Published on: Sat Nov 28, 2026 3:10PM

తూర్పు గోదావరి జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవం, అలాగే  రాజమండ్రి బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవ వేడుకలు శనివారం (నవంబర్ 28) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   శతాబ్దాల   ఘన  చరిత్ర కలిగిన ఈ రెండు సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా న్యాయ సేవలను అందిస్తూ దేశ న్యాయవ్యవస్థలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.  ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థతో పాటు ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ కూడా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సమాన బాధ్యతతో పనిచేస్తోందన్నారు. 

రాజమహేంద్రవరం నగరానికి ఉన్న సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను నారా చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆదికవి నన్నయ్య, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయులు ఈ గడ్డను పునీతం చేశారని, సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీతో ఉభయ గోదావరి డెల్టా సస్యశ్యామలమై అన్నపూర్ణగా మారిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి కాబోతోందని,  రానున్న గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం తనకు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులందరూ గోదావరి పుష్కరాలకు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించాలని   ఆహ్వానించారు.

న్యాయ రంగంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖుల సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించి స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదుర్కొన్న టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తిని కొనియాడారు. రాజమండ్రి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. 1849లోనే అధికారిక కోర్టుగా గుర్తింపు పొందిన సీతానగరం రచ్చబండ ప్రజాకోర్టు చరిత్రను చంద్రబాబు ప్రస్తావిస్తూ.. తాటి ఆకులపై తీర్పులు రాసే దశ నుంచి నేటి  ఏఐ యుగం వరకు న్యాయ వ్యవస్థ ఎంతో రూపాంతరం చెందిందని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, రాజధాని అమరావతి పరిరక్షణలో నాటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెలువరించిన తీర్పు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్రలో నిలిచారని ప్రశంసించారు.   న్యాయ పాలనలో ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్‌మెంట్' కోసం త్వరలోనే  లీగల్ ఏఐ స్టాక్' అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా 8.4 లక్షల కేసులను పర్యవేక్షిస్తున్నామని, కొత్తగా రానున్న లీగల్ ఏఐ స్టాక్ ద్వారా యూనిఫైడ్ డిజిటల్ లా రిపాజిటరీ, నిబంధనలు, జీవోలు, కేసు రికార్డుల నిర్వహణతో పాటు ఏఐ ఆధారిత కేసు విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల తయారీ వంటి ప్రక్రియలు వేగవంతమవుతాయన్నారు.

ఇది కూడా చదవండి: కోర్టు విచారణల ప్రసారంపై నిషేధం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.!​

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని, ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలూ బలంగా ఉండటమే ఇందుకు కారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పౌర సేవలందించడంలో, పన్నుల వసూళ్లలో ఏఐ సాంకేతికత సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, న్యాయస్థానాల సహకారంతో ఆర్బిట్రేషన్, మీడియేషన్, లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ కేసులను త్వరగా పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరంలో జరిగిన ఈ చారిత్రక వేడుకల్లో న్యాయ వ్యవస్థ ఘనమైన వారసత్వాన్ని స్మరించుకుంటూనే, 2047 నాటికి  వికసిత్ భారత్ - స్వర్ణాంధ్ర' లక్ష్య సాధనలో న్యాయ పాలన ఆధునీకరణ పాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు  వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మీకు నచ్చవచ్చు: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు జడ్ ప్లస్ భద్రత​

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్...రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

[East Godavari District Court, Rajahmundry Bar Association, Chandrababu,  Legal AI initiatives, TeluguOne]