TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కోర్టు విచారణల ప్రసారంపై నిషేధం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.!

Published on: Wed Nov 25, 2026 2:54PM

 కోర్టు విచారణలను అనధికారికంగా రికార్డు చేయడం, వివిధ వేదికలపై ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు   ఉత్తర్వులు వెలువరించింది.ఈ తాజా ఆదేశాల ప్రకారం, న్యాయస్థానం ముందస్తు అనుమతి లేకుండా విచారణలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, ఫొటోలు లేదా స్క్రీన్‌షాట్లను సేకరించడం నిషేధం. కేవలం కోర్టు హాళ్లలో ప్రత్యక్షంగా జరిగే విచారణలకే కాకుండా..  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగే విచారణలకు సైతం ఈ నిషేధం వర్తిస్తుంది.  

అలాగే, సంబంధిత అధికారుల అనుమతి లేకుండా కోర్టు విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడం, రికార్డు చేసిన దృశ్యాలను టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో అప్‌లోడ్ చేయడంపై కూడా నిషేధం విధించిన హైకోర్టు, ఉల్లంఘనను తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.  తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిబంధనలు న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులతో పాటు కోర్టు సిబ్బంది అందరికీ వర్తిస్తాయని స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు,  ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఇటీవల కాలంలో కోర్టు విచారణలకు సంబంధించిన చిన్నచిన్న వీడియో క్లిప్పులను  సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ధోరణిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ కఠిన నిబంధనలు అవసరమని న్యాయనిపుణులు అంటున్నారు.  హైకోర్టు జారీ చేసిన ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమించి, అనధికారికంగా విచారణల దృశ్యాలను ప్రసారం చేసినా లేదా ఇతరులకు చేరవేసినా చట్టప్రకారం కఠిన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హైకోర్టు  హెచ్చరించింది.  

[APHighcourt, Ban, CourtHearings, LiveStreaming, Recording, TeluguOne]