పళని సర్కార్ లాస్ట్ మినిట్ బంపర్ ఆఫర్.. స్టాలిన్ కు దెబ్బేనా 

మనదేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ఎత్తుగడలతో సిద్ధమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందు ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. సహకార బ్యాంకులు, సహకార సంఘాల నుండి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొందిన రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా సీఎం పళనిస్వామి శాసనసభలో ప్రకటించారు. బంగారం తాకట్టు పెట్టి మహిళలు తీసుకున్న రుణాలను కూడా రద్దు చేస్తున్నట్లు అయన తెలిపారు. అంతేకూండా వన్నియార్‌ సామాజిక వర్గానికి బీసీ, ఓబీసీ రిజర్వేషన్లలో 10.5% కోటా ఇస్తున్నట్లు మరో ప్రకటన చేసారు.

మరోపక్క తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు స్టాలిన్ నాయకత్వంలోని ప్రతిపక్ష డీఎంకే కు కొంత అనుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సీఎం పళని స్వామి చివరి నిముషంలో ప్రకటించిన ఈ తాయిలాలతో తమిళనాడు ఓటర్లు ఎవరికి జై కొడతారో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఏపీలో 2019 లో ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు మహిళలకు పసుపు కుంకుమ పేరుతొ విడతలవారీగా 10 వేల రూపాయాలను డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వేసినా ఆ ఎన్నికలలో టీడీపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాలలో లబ్ది పొందినవారు తప్పకుండా ఆ పార్టీకే ఓటేస్తారనే గ్యారంటీ లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇపుడు తమిళనాడు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుతారో వేచి చూడాలి.