మళ్లీ కరోనా కోరల్లో దేశం! రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం 

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్న దశలో మరో మారు మహమ్మారి పంజా విసురుతుండటం  ఆందోళన కలిగిస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొవిడ్ 19 నిబంధనలు గాలికి వదిలేయడం ,  పండగలు ఇతర సామాజిక కార్యక్రమాల్లో గుంపులుగా పాల్గొనడం వల్లే  కరోనా మళ్ళీ ఉదృతం అవుతోందని  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు చెబుతున్నారు. దేశంలో మరో మారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్ 19 నిబధనలు యథాతథంగా మార్చి 31 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

కరోనా కట్ట్టడిలో ఉన్నట్లు కనిపిస్తున్నా మహమ్మారి  ఇంకా మానవాళిని వదిలి పోలేదని  కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. నిఘా, నియంత్రణ చర్యలు, ముదస్తు జాగ్రత్తలు అవసరమని తేల్చి చెప్పింది. వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంచేయాలని, వాక్సినేషన్ పాటల ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మార్చి 1వతేదీ నుంచి రెండవ విడత వాక్సినేషన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా మొదలవుతోంది. టీకా వేసుకొవాలనుకొనేవారు అన్‌లైన్‌లోనే కాకుండా టీకా కేంద్రాల్లోనే పేర్ల నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా వేసుకొనే వారు తమ గుర్తింపు పత్రాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. టీకాలు వేసుకున్నతర్వాత కూడా మాస్క ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రత పాటించం తప్పక పాటించాలని, వైద్యులు చెబుతున్నారు. 

దేశంలో శుక్రవారం కొత్త‌గా 16,488 మందికి కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే స‌మ‌యంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు. 1,59,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 1,42,42,547 మందికి వ్యాక్సిన్ వేశారు.