మానవత్వం చాటిన దుబాయ్ ఆసుపత్రి

కోటి 52 లక్షల రూపాయల బిల్లు మాఫీ..
కరోనా పాజిటివ్ వ్యక్తికి 80రోజుల చికిత్స..
ప్లైట్ టికెట్, పది వేల రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించిన వైనం..

మాయమై పోతున్నడమ్మ.. మనిషన్నవాడు అంటూ సాగే పాటను వింటే నిజమే అనిపిస్తుంది. రోగి చనిపోయినా బిల్లు కడితే తప్ప శవాన్నికూడా ఇవ్వలేమని కఠినంగా చెప్పే మన హస్పిటల్స్ ను చూస్తూ. కానీ, దుబాయ్ లోని ఒక హస్పిటల్ కోటి 52లక్షల రూపాయల బిల్లును మాఫీ చేయడంతో పాటు ఆ వ్యక్తికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి జేబులో పదివేల రూపాయలు పెట్టి సొంత ఊరికి పంపించింది.
ఆసుపత్రిలోనూ తోడుగా ఉంటూ అతని సమస్యను పరిష్కరించేలా సహాయం చేశారు స్నేహితులు, అధికారులు. ఇలాంటి సంఘటనలు మానవత్వం ఇంకా ఉందని మనిషన్నవాడు అక్కడక్కడ బతికే ఉన్నాడు అనిపిస్తుంది. ఇక విషయంలోకి వస్తే.. 

తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన రాజేష్ లింగయ్య ఒడ్నాలా రెండేండ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంలో ఏప్రిల్ 23 న  ‘దుబాయ్ హాస్పిటల్’ లో చేరాడు. తరువాత అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా  కోవిద్ 19 వైరస్ పాజిటివ్ గా తేలింది. 

దాదాపు 80రోజుల పాటు చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. ఆరోగ్యంగా కోలుకున్నా.. ఆర్థికంగా మాత్రం ఆయన హాస్పిటల్ బిల్లు కట్టే పరిస్థితిలో లేరు. అతని చికిత్సకు మొత్తం బిల్లు 7,62,555 దినార్లు అయ్యింది. మన కరెన్సీలో కోటి 52లక్షలు.  చికిత్స సమయంలో రాజేష్‌తో సన్నిహితంగా ఉన్న దుబాయ్‌లోని గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తన పరిస్థితి వివరించాడు రాజేష్.

బిల్లు చెల్లించడానికి తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఈ విషయాన్ని నరసింహ దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటీర్ సుమంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. 

సుమంత్  కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కాన్సుల్ (లేబర్) హర్జీత్ సింగ్ను అభ్యర్థించారు. ‘మానవతా ప్రాతిపదికన’ బిల్లును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సింగ్ దుబాయ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు ఒక లేఖ రాశారు. ఆసుపత్రి సానుకూలంగా స్పందించి రోగిని వెంటనే డిశ్చార్జ్ చేసింది. అంతేకాదు రాజేష్‌ తిరిగి సొంత గ్రామానికి చేరుకోవడానికి ఉచిత విమాన టిక్కెట్లు ఏర్పాటు చేశారు, అతను ఇతర ఖర్చుల కోసం 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఎయిర్ ఇండియా ద్వారా హైదరాబాద్ చేరుకున్న రాజేష్ కు వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత 14రోజుల క్వారంటైన్ పాటించాలని సూచిస్తూ ఇంటికి పంపించారు. 80రోజులు కరోనాతో పోరాడి, కోటిన్నర బిల్లును మాఫీ చేయించుకుని వచ్చిన రాజేష్ ను చూసి కుటుంబసభ్యులు ఎంతో ఆనందించారు.