ప్రపంచంలోని కరోనా వ్యాక్సిన్ డేటా పై కన్నేసిన రష్యా గూఢచారులు.. 

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వాధినేతల నుండి ఇటు సామాన్యుల వరకు అందరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచం లోని 20 ప్రముఖ పరిశోధనా సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో పక్క రష్యా కు చెందిన సెచేనోవ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మూడు దశల ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే బ్రిటన్, కెనడా, అమెరికా లోని కరోనా వ్యాక్సిన్ రిసెర్చ్ సెంటర్ల మీద రష్యా హ్యాకర్లు సైబర్ ఎటాక్‌కు పాల్పడినట్టు యుకె తాజాగా ఆరోపించింది. 

రష్యాకు చెందిన ఏపీటీ29 అనే గ్రూప్ ఈ సైబర్ ఎటాక్ చేసినట్టు ఆయా దేశాల సైబర్ సెక్యూరిటీ విభాగాలు గుర్తించాయి. ద డ్యూక్స్, కాజీ బేర్ అని పిలవబడే ఈ గ్రూప్ రష్యా నిఘా విభాగానికి అనుబంధ సంస్థ. రష్యాకు చెందిన ఈ హ్యాకర్లు తమ మేధావులు, హెల్త్ కేర్‌కు చెందిన విభాగాలపై సైబర్ ఎటాక్ చేసి కీలకమైన సమాచారం చోరీ చేయడానికి ప్రయత్నించారని యూకే జాతీయ సైబర్ భద్రతా విభాగం ఆరోపించింది. 2016 అమెరికా ఎన్నికల సమయంలో కూడా వీరు అమెరికన్ డేటాను హ్యాక్ చేసినట్టు ప్రచారం ఉంది. ఐతే కరోనా వైరస్ వ్యాక్సిన్ సమాచారం హ్యాక్ చేయడానికి వీరు ప్రయత్నించినట్టు మొట్టమొదటి సారి వెలుగులోకి వచ్చింది. ఐతే ఈ సైబర్ ఎటాక్స్ తో మాకు సంబంధం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేసారు. బ్రిటన్ లోని కోవిడ్ 19 రీసెర్చ్ సెంటర్లు, ఫార్మా కంపెనీల మీద సైబర్ ఎటాక్ ఎవరు చేశారో తమకు తెలీదు అని అయన ప్రకటించారు.