TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుందాతనం లేని ట్రంప్ తీరు: వలస విధానాలు, టారిఫ్ టెర్రర్.. రిపబ్లికన్ల పరాభవ కారణాలు.!

Published on: Tue Nov 10, 2026 11:20AM

అమెరికాలో ఇటీవలి  మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలపై అమెరికా ఓటర్ల నుంచి వ్యక్తమైన   వ్యతిరేకతే మధ్యంతర ఫలితాలలో ప్రతిఫలించింది. ట్రంప్ పై అమెరికన్లలో గూడుకట్టుకున్న అసంతృప్తికి, వ్యతిరేకతకు మధ్యంతర ఫలితం అద్దం పట్టింది.  ఈ ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీ అద్భుత విజయాలను సాధించి, కాంగ్రెస్‌లోని రెండు సభలపై పట్టు  బిగించింది. ట్రంప్ తన పాలనను ఈ ఎన్నికలకు రెఫరెండమ్‌గా ప్రకటించుకున్నారు. జనం కూడా అలాగే భావించి తీర్పు ఇచ్చారు. ట్రంప్  పాలనపై తమలో ఉన్న అసంతృత్తి తీవ్రతను ఓటు ద్వారా చాటారు. 

గతంలో  క్లింటన్‌కు, లేదా జార్జ్ డబ్ల్యూ బుష్‌ కాలంలో ఎదురైన పరాజయాల మాదిరిగానే ప్రస్తుత ఎన్నికలు ఉన్నప్పటికీ, ట్రంప్ ఎదుర్కొన్న ఈ ఓటమి మాత్రం అపూర్వమైనదిగా చెప్పుకోవాలి.  సుదీర్ఘకాలం పాటు సేవలందించిన సుసాన్ కాలిన్స్ వంటి సీనియర్ నేతలు సైతం తమ స్థానాలను కోల్పోయారు. అలాగే టెక్సాస్ వంటి సంప్రదాయ రిపబ్లికన్ కంచుకోటలలో సైతం డెమొక్రాట్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.  రెండుసార్లు అభిశంసనలను, అనేక కేసులను తట్టుకుని నిలబడిన ట్రంప్‌ను, ప్రతి రెండేళ్లకు జరిగే కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలు ఈసారి గట్టిగా దెబ్బతీశాయి.

దేశంలో విపరీతంగా పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన చార్జీల భారం సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో విఫలమవడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది.

దీనికి తోడు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ యుద్ధంలో జోక్యం చేసుకోవడం, గాజాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన విదేశీ విధానాలపై అమెరికన్లలో గూడుకట్టుకున్న   వ్యతిరేకత మధ్యంతర ఫలితాల్లో ప్రస్ఫుటమైంది.   సుదీర్ఘ కాలం సాగే యుద్ధాలను, ప్రత్యర్థి దేశాల అగ్రనేతల అంతం వంటి దూకుడు చర్యలను ప్రజలు ఏ మాత్రం హర్షించలేదనడానికి ఈ మధ్యంత ఫలితాలే సాక్ష్యంగా పరిశీలకులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి:  వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!

వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్   అనుసరించిన   విధానాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అక్రమ వలసలను నియంత్రించాలనే ప్రజాభిప్రాయం ఉన్నప్పటికీ, వలసదారులను, ముఖ్యంగా భారత మూలాలున్న వారిని చేతికి బేడీలు వేసి అవమానకర రీతిలో స్వదేశాలకు పంపడాన్ని ప్రజలు సమర్థించలేదు సరికదా, తిరస్కరించారు.  లాటినో ఓటర్లు సైతం ఈసారి రిపబ్లికన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. ఎన్నికల్లో అబ్దుల్ ఎల్ సయేద్ వంటి ముస్లిం అభ్యర్థులు విజయం సాధించడం అమెరికా రాజకీయాలలో మారుతున్న సామాజిక సమీకరణాలకు అద్దం పడుతోంది.

 కాంగ్రెస్‌పై డెమొక్రాట్ల పూర్తి నియంత్రణ ఉండటం వల్ల భవిష్యత్తులో ట్రంప్ తన నిర్ణయాలను అమలు చేయడానికి వీటో అధికారాలపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది.   ఏకపక్ష నిర్ణయాలు, అహంభావ ధోరణి,  అవినీతి ఆరోపణలే ట్రంప్  ప్రభుత్వానికి ఈ స్థాయిలో పరాభవం ఎదురవ్వడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మిలిటరీ ఆధిపత్యం,  రాజకీయ హుందాతనం లేని ట్రంప్ పాలనే ఈ ఫలితాలకు కారణమని రిపబ్లికన్ లు సైతం బాహాటంగానే విమర్శిస్తున్నారంటేనే ట్రంప్ ఎంతగా ప్రజాదరణకు దూరమయ్యారో అర్ధమౌతుంది.  

మీకు నచ్చవచ్చు: నోబెల్ ప్రైజ్ రాలేదని అలిగిన ట్రంప్.. కనీసం ఆ అవార్డు అయినా ఇవ్వాలని డిమాండ్.!

శాంతి ఒప్పందం కుదరాలంటే ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాలి: ట్రంప్ సంచలన ప్రకటన.!

[Donald Trump Defeat Democrats Triumph, US Midterm Elections, US Congress Control, Democrat Victory, US Political Upheaval, Inflation, Telugu One]