TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శాంతి ఒప్పందం కుదరాలంటే ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాలి: ట్రంప్ సంచలన ప్రకటన.!

Published on: Sat Oct 17, 2026 4:55PM

రష్యాపై అమెరికా ఆంక్షల సడలింపుపై ఉక్రెయిన్ అసహనం
మాస్కోకు బహుమతులతో శాంతి సిద్ధించదన్న జెలిన్ స్కీ
ఉక్రెయిన్ కు మద్దతు కొనసాగుతుందన్న యూరోపియన్ యూనియన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,  ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలిన్‌స్కీల మధ్య దౌత్యపరమైన విభేదాలు పీక్స్ కు చేరాయి. రష్యా ఇంధన మౌలిక వసతులపై ఉక్రెయిన్ జరుపుతున్న దాడులను ట్రంప్   ఖండించడమే కాకుండా, జెలిన్‌స్కీది విఫలనాయకత్వంగా అభివర్ణించారు. పరిస్థితులు కుదుటపడాలంటే.. ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన అవసరం ఉందన్నారు. జెలెన్ స్కీ వైఖరి  ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడానికి కారణమవుతోందని ట్రంప్ అన్నారు. 

ఇటీవల రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిన సంగతి విదితమే. ఉక్రెయిన్ దాడులపై  ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా డీజిల్,  చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమౌతున్నాయని మండిపడ్డారు.  యుద్ధాన్ని ముగించాలనే ప్రతిపాదనలపై జెలిన్‌స్కీ సహకరించడం లేదని, పుతిన్ కంటే జెలిన్‌స్కీతోనే శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం  కష్టంగా మారిందన్న ట్రంప్.. రష్యాతో తాత్కాలిక ఇంధన కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అడ్డంకులు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. 
 అయితే.. రష్యాతో అమెరికా కుదుర్చుకున్న డీజిల్ ఒప్పందమే ఈ వివాదానికి కారణంగా అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు ట్రంప్  రష్యా నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఇంత కాలం అనుసరిస్తున్న వైఖరిని పక్కన పెట్టి రష్యాతో ఒప్పందానికి ట్రంప్ మొగ్గు చూపారు. రష్యా నుంచి కొనుగోళ్లు చేసినందుకు ఇండియా, చైనా వంటి దేశాలపై టారిప్ వార్ ప్రకటించిన విషయాన్ని మరచి ట్రంప్.. రష్యాతో ఒప్పందానికి దిగి వచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని   జెలిన్‌స్కీ   నిరసిస్తూ, రష్యాకు అనుకూలంగా అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భాగస్వామ్య ధర్మానికి విరుద్ధమని విమర్శలు గుప్పించారు. రష్యాతో ఒప్పందం అంటూ.. ట్రంప్ రష్యాకు బహుమతులు ఇస్తున్నారనీ, వాటి వల్ల వల్ల శాంతి సిద్ధించదని, ఉక్రెయిన్   రాజీపడేది లేదని జెలిన్‌స్కీ కుండబద్దలు కొట్టారు. 

రష్యాతో అమెరికా ఒప్పందమే జెలెన్స్కీ అసహనానికీ, అసంతృప్తికీ కారణమనడంలో సందేహం లేదు. అయితే కిందపడ్డా పై చేయి నాదేనంటున్న ట్రంప్.. రష్యాతో ఒప్పందం గురించి మాట్లాడకుండా, ఉక్రెయిన్ ను, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని నిందిస్తున్నారు. ఉక్రెయిన్ కు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే సమర్థత ఉన్న కొత్త నాయకుడు   అవసరమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి, దేశం తీవ్రంగా నష్టపోవడానికి జెలిన్‌స్కీ అనుసరిస్తున్న మొండి వైఖరే కారణమన్న ట్రంప్.. రష్యన్ చమురు సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం శ్రమిస్తుంటే, ఉక్రెయిన్ దాడుల ద్వారా సమస్యను   జటిలం చేస్తోందని విమర్శించారు. 

ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వైఖరి పట్ల బ్రిటన్, యూరోపియన్ యూనియన్ అభ్యంతరం వ్యఖ్యం చేశాయి.  రష్యాపై ఆంక్షలు సడలించడం,  ఉక్రెయిన్‌ను బలహీనపరచడం సరైన విధానం కాదని విస్పష్టంగా పేర్కొన్నాయి.  జెలిన్‌స్కీకి తమ మద్దతు కొనసాగుతుందని విస్పష్టంగా ప్రకటించాయి.   అదలా ఉంటే..  అమెరికా వైఖరి కారణంగా శాంతి చర్చలు విఫలమైతే..  తూర్పు ఐరోపాలో యుద్ధ వాతావరణం మరింత సంక్లిష్టంగా మారే అవకాశముందనడంలో సందేహం లేదు. 

[Trump Zelensky War Of Words,  US Ukraine Tensions, Donald Trump Russia Ukraine war, Zelensky Energy iInfrastructure Attack, US Russia Diesel Deal, Telugu One]