ఓరినాయనో..ట్రంప్‌కి నోబుల్ శాంతి బహుమతా?
posted on Jun 22, 2025 11:21AM

ఈ ప్రపంచానికి ఏదో అయ్యింది. తన చేతులకు ఇన్నేసి రక్తపు మరకలను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బహుమతికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం ప్రతిపాదించడం అంటే. ఈ కలియుగం దాదాపు అంతానికొచ్చేసినట్టేనా. అంటే అవుననే తెలుస్తోంది.మొన్నంటే మొన్న యూఎస్ జనరల్ పాక్ జనరల్ మునీర్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఉగ్రవాద నిరోధంలో కీలక పాత్ర పోషించారనడం ఎలాంటిదో.. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ యుద్ధ వాతావరణం కంట్రోల్ చేస్తున్నారని పాక్ కామెంట్ చేయడం కూడా సరిగ్గా అలాంటిదేనని అంటారు కొందరు అంతర్జాతీయ దౌత్య వ్యాపారాల నిపుణులు.మునీర్ ఎంతటి ఉగ్ర వ్యతిరేఖో, ట్రంప్ కూడా అంతటి యుద్ధ వ్యతిరేకి, శాంతి పిపాసిగా చూడాల్సి వస్తుందని అంటారు వీరంతా.
కారణమేంటంటే మొన్నంటే మొన్న జీ7 నుంచి వెళ్తూ వెళ్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కాల్పుల విరమణ కాదు అంతకన్నా మించి జరగబోతుందని అన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతా? ఇరాన్ రాజధాని టెహ్రాన్ వాసులంతా తమ తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సిందేనని సూచించిన వ్యక్తికి నోబుల్ శాంతి బహుమతా? ఇప్పటికే పశ్చిమాశియాకి తన యుద్ధ నౌకలను తరలించడంతో పాటు భారీ ఎత్తున బంకర్ బస్టర్ బాంబులను తరలించమని ఆదేశించిన వ్యక్తికి నోబుల్ శాంతి బహుమతా? రష్యాతో ఉక్రెయిన్ యుద్దంలో ఉండగానే అరుదైన ఖనిజ నిల్వలు తమకు దక్కేలా ఒప్పందాలు చేసుకున్న బేహారి ట్రంప్ కి శాంతి బహుమతా?
తాము 85 కోట్ల రివార్డు ప్రకటించిన హఫీజ్ సయీద్.. అక్కడ తన కొడుకు తల్హాతో సహా ఉగ్ర విధ్వంసకాండ చేస్తుంటే.. అతడికి అతడి కొడుక్కీ పాక్ సైన్యం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే.. ఉగ్రవాదుల మరణాల సమయంలో సైనికాధికారులు వెళ్లి మరీ వారి మృతదేహాలకు జాతీయ జెండా కప్పి వస్తుంటే.. సుల్తానన్ బషీరుద్దీన్ అనే ఒక అణు ఉగ్రవాది కొడుకు ఏకంగా ఆ దేశ డీజీఐఎస్పీఆర్ గా సైన్యంలో అత్యంత పెద్ద హోదాలో ఉంటే.. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉగ్ర అరాచకాలకు కేంద్రమై చేతినిండా రక్తపు మరకలు అంటుకున్న పాక్ ఏమిటీ? అంతకన్నా రక్తపు మరకలు అంటించుకుంటోన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి కి సిఫార్సు చేయడమేంటి? అది కూడా మునీర్ కి ట్రంప్ విందు ఇచ్చిన మూడు రోజుల తర్వాత పాక్ నుంచి ఈ ప్రకటన రావడమేంటి?
అయితే ఇక్కడ మునీర్ కే ఇంత ప్రయారిటీ ఏంటని చూస్తే.. డబల్యూఎల్ఎఫ్ వంటి తన కుటుంబ సంస్థలో పాకిస్తాన్నే ఏకంగా తాకట్టు పెట్టేందుకు ఆయన దగ్గరుండి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించడం వల్లే.. ఇదంతా జరుగుతున్నట్టు ఒక అంచనా. లేకుంటే ఆపరేషన్ సిందూర్ లో వార్ ప్లాన్స్ లేవు ఓన్లీ ప్రేయర్సే అని చేతులెత్తేసిన మునీర్ కి.. యూఎస్ ఆర్మీ 250వ పెరెడ్ కి అందుకే పిలిచినట్టుగా ఒక సమాచారం. అంతే కాదు మునీర్ కి పాక్ చరిత్రలోనే రెండో సారి ఫీల్డ్ మార్షల్ హోదా రప్పించడంలోనూ ట్రంప్ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి మునీర్ ఏం చేస్తాడు.. భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించేలా కామెంట్లు చేస్తాడు. ఆ తర్వాత వారు.. పహెల్గాం వంటి దాడులకు తెగబడతారు.
ఇక ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున ప్యాకేజీలు పాక్ కి రావడంలోనూ ట్రంప్ పాత్ర బలంగా ఉంది. ఈనిధుల్లోని కొంత మొత్తాలను మసూద్ అజర్ వంటి ఉగ్రనాయకులకు నష్టపరిహారం కింద ఇస్తుంది పాక్. మొన్నంటే మొన్న పహెల్గాం సూత్రధారి కసూరీని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలో చేర్చితే.. అదో గర్వకారణంగా అతడు పబ్లిగ్గా రోడ్ల మీద తిరుగుతూ కామెంట్లు చేస్తుంటే పాక్ పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి పాకిస్థాన్ చేసే ప్రతి ఉగ్ర చర్యనూ ఖండించాల్సింది పోయి విందులూ వినోదాలు గౌరవాలు పదవులతో పాటు నిధులు ఇప్పిస్తోంది ట్రంప్ సర్కార్.
ఈ మొత్తం వ్యవహారంతో పాటు చైనాకి ప్రస్తుతం ఎంతో దగ్గరగా ఉన్న పాక్ ద్వారా ట్రంప్ పరిపాలన మరింతగా ఏదో ఆశిస్తున్నట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడేలా ఈ రెండు దేశాలు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. తొలి ట్రంప్ పాలన ఇదే పాకిస్థాన్ కి హెచ్చరికలు జారీ చేసింది. మీ దేశంలోని ఉగ్రవాదాన్ని మీరు కట్టడి చేయకుంటే నిధులివ్వమని ఖరాకండిగా చెప్పారు కూడా. అదే సెకండ్ టర్మ్ వచ్చేలోగా.. పాక్ చైనాకు మరింత దగ్గర కావడంతో.. ఇదిగో దాన్ని బుజ్జగించి.. చైనాను దారికి తెచ్చుకోవడంలో భాగంగా ట్రంప్ ఇటు మునీర్ ద్వారా తమ సంస్థల్లో పాక్ ని ఇన్వాల్వ్ చేయడం.. అటు అతడి ద్వారా ఇటు భారత్, చైనాలకు ఏక కాలంలో చెక్ పెట్టేలా అడుగులు వేయడం వంటివి జరుగుతున్నట్టు భావిస్తున్నారు నిపుణులు.అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఖమైనీ అంతమే ధ్యేయంగా సాగుతున్న ఇజ్రాయెల్ కి ఇంత సపోర్ట్ చేస్తూ.. ఇదంతా శాంతి కోసం చేస్తున్న యత్నమని.. తనలాంటి శాంతి కాముకులకు నోబుల్ శాంతి బహుమతి రాదని ఆయనకు ఆయన రివర్స్ స్టేట్ మెంట్ ఇచ్చుకోవడం ఏదైతే ఉందో.. అది ట్రంప్ కి తెలిసినంత మరెవరికీ తెలీదని చెప్పాలంటారు దౌత్యనిపుణులు.