ఒక్క మాస్కు ఇచ్చి 15 రోజులు వాడ‌మంటారా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కొద్దీ... మాస్కులకు సైతం డిమాండ్ పెరిగిపోయింది. అంతేకాదు హెల్త్ వర్కర్లకు కూడా మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారు ఫిర్యాదులు కూడా పెరిగాయి. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వైద్య సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బందికి సరైన సదుపాయాలు లేక‌పోవ‌డం ఆందోళన కలిగిస్తోంది. తమకు సరైన పీపీఈ కిట్లు, మాస్కులు వంటి సదుపాయాలు లేవని కొంత మంది డాక్ట‌ర్లు ఉద్యోగాలు వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

తాజాగా, విశాఖపట్నంలో వైద్యుడు సుధాకర్‌ రావ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని నర్సిపట్నం ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిలో అనెథ్సెటిస్ట్‌గా పనిచేస్తోన్న తమకు మాస్కులు అందడం లేవని చెప్పారు.

కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో నాకు ఒకే ఒక్క మాస్కు ఇచ్చారు.. దాన్ని 15 రోజుల పాటు ఉపయోగించుకోవాలని చెప్పారు. వారు అసలు ఏమనుకుంటున్నారు? కరోనా పాజిటివ్‌ కేసులు ఇక్కడకు రావని అనుకుంటున్నారా? దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఇటువంటి ఘటనలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.