ఈ జగన్మోహనరావు ఎవరో తెలుసా?
posted on Jul 11, 2025 2:22PM

ఎవరో ఊరూ పేరు లేని జగన్మోహన రావు ఏ క్లబ్ లో మెంబర్ కూడా కాని జగన్మోహన రావు.. రాజకీయ క్రీడ తప్ప మరే క్రీడా తెలియని జగన్మోహన రావు.. ఇంత స్థాయికి తిమ్మిని బమ్మిని చేసి ఇక్కడి వరకూ ఎలా వచ్చారో మీకు తెలుసా? ఇంతకీ ఈయన మరెవరో కాదు హరీష్ రావు పెద్దమ్మ కొడుకట. దీంతో అప్పటి వరకూ గడ్డం వినోద్, అజర్ చేతుల్లో ఉన్న హెచ్ సీ ఏ కాస్తా.. తన అధికార బలం ఉపయోగించి.. అక్రమంగా శ్రీ చక్ర అనే ఒకానొక క్లబ్ లో ఫోర్జరీ సంతకాలతో మెంబర్ గా మారి.. ఆ పై కేవలం 2 ఓట్ల తేడాతో 2023లో అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత అయ్యగారి ఆగడాలు ఏమంత తక్కువ లేవట. ఏకంగా రూ. 170 కోట్లకు టెండర్ పెట్టారు. బీసీసీఐ నిధులు గోల్ మాల్ చేశారు.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్పేదాన్నిబట్టీ చూస్తే.. అసలీ నాన్ ప్లేయర్స్ కి ఇలాంటి క్రీడా సంఘాల్లో పనేంటి? అన్నదొక చర్చ. 1934 నాటి హెచ్ సీ ఏ.. చరిత్ర గతమెంతో ఘనం. ఎంఎల్ జయసింహ, అజర్, శివలాల్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా, అంబటి రాయుడు వంటి మేటి క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించిన సంఘం. ఇది బీసీసీఐకి అఫిలియేటెడ్. ఎన్నో రంజీ మ్యాచ్ లలో హైదరాబాద్ క్రికెట్ టీమ్ ని ఆడిస్తుంది హెచ్ సీఏ. దీని హోం గ్రౌండ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం. అలాంటి అసోసియేషన్లోకి ఎప్పుడైతే రాజకీయ బేహారులు అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి ఇది పూర్తి పతనావస్తకు చేరుకునేలా పయనిస్తోందని అంటారు. మీకు తెలుసా? ఇక్కడ ఆడేవాళ్లను పక్కన పెట్టి డబ్బులిచ్చేవాళ్లను సెలెక్ట్ చేస్తుంటారట. ప్లేయర్స్ పేరంట్స్ నుంచి ఇప్పటి వరకూ వీరు భారీ ఎత్తున డబ్బు గుంజారట. అంతేనా మొన్నటి మార్చిలో ఎస్ ఆర్ హెచ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేశారు.
అసలు గొడవంతా బయట పడిందే ఈ ఎస్ ఆర్ హెచ్, ఎల్ ఎస్ జీ మ్యాచ్ ద్వారా. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగ్గా.. ఇందులో 39 వేల కెపాసిటీ ఉంటుంది. ఈ కెపాసిటీలో టెన్ పర్సెంట్ ఫ్రీగా హెచ్ సీ ఏ కి ఇచ్చింది ఎస్ ఆర్ హెచ్. ఇది చాలదన్నట్టు మరో పది శాతం కావాలని డిమాండ్ చేయడమే కాదు.. ఎఫ్ 3 అనే బ్లాక్ ని క్లోజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిందట హెచ్ సీ ఏ. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి.. తెలంగాణ గవర్నమెంట్ వరకూ వెళ్లింది. దీంతో సీఎం రేవంత్ విచారణకు ఆదేశించారు. తద్వారా.. జగన్మోహనరావు అండ్ కో బెదిరింపులకు పాల్పడ్డట్టు తేలింది. తీగలాగితే డొంక కదిలినట్టు.. ఈ వ్యవహారంరతో పాటు ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు బయట పడ్డాయి.
ఒక అధ్యక్షుడు ఇలా అరెస్టు కావడం అంటే.. అది ఈ క్రీడా సంఘానికే మాయని మచ్చ అంటారు మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్. ఈ మొత్తం ఎన్నికను క్యాన్సిల్ చేసి కొత్తగా ఎంపిక చేయాలని.. తనకు మరోమారు అవకాశమిస్తే మంచిగా పాలన సాగిస్తానని.. గ్రామీణ స్థాయిలో క్రికెటర్లు వెలుగు చూసేలా చేస్తానని అంటున్నారు మాజీ క్రికెట్ కెప్టెన్, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ సీ ఏ- అజరుద్దీన్.
2017లో ఒక టీ ట్వంటీ టోర్మమెంటు తప్ప ఇప్పటి వరకూ ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడలేదు ఈ క్రీడా సంఘం. ఎప్పుడు చూసినా ఏవో ఒక వార్తలు. హెచ్ సీ ఏలో అవినీతి, రాజకీయాలంటూ వివాదాలు. ఒక సమయంలో ఈ జట్టు నుంచి రంజీ ఆడమంటే ఆడనని మొండికేశాడు అంబటి రాయడు. అదీ దీని ఘనత. మరి చూడాలి ఇకనైనా ఈ క్రికెట్ సంఘం.. ప్రక్షాళనకు గురై మంచి మంచి ఆటగాళ్లు వెలుగు చూస్తారా లేదా తేలాల్సి ఉంది.