విజయకాంత్ మెడకు 500 కోట్లు...

 

తమిళనాడు ఎన్నికల్లో డీఎండీకే అధ్యక్షుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈసారి అధికారం నాదే అన్న రేంజ్ లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ రిజల్ట్ శూన్యం. చాలా దారుణంగా ఓడిపోయింది డీఎండీకే. అయితే ఇప్పుడు ఆయనపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు, జిల్లా శాఖల నాయకుల నుంచి సేకరించిన రూ.500 కోట్లు ఏమయ్యాయని మక్కల్‌ డీఎండీకే నేత చంద్రకుమార్‌ ప్రశ్నిస్తూ.. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్‌లపై ప్రజాహిత వాజ్యం దాఖలు చేయనున్నారు. డీఎండీకే నాయకుడు విజయకాంత్ పార్టీ అభివృద్ధి కోసం, సామాజిక కార్య్రకమాల్లో పేదలకు సహాయకాలు పంపిణీ కోసం జిల్లాలవారీగా పార్టీ శాఖల కార్యదర్శుల నుంచి తలా రూ.27 లక్షల వంతున రూ.500 కోట్ల వరకు విరాళాలు సేకరించి మోసగించారని ఆరోపించారు. ఆ విరాళాల మోసంపై త్వరలో ప్రజాహితవాజ్యం వేయాలని భావిస్తున్నామని చెప్పారు.

కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే..  ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది ఎంత మాత్రం ఇష్టం లేని చంద్రకుమార్‌ పార్టీ నుండి బయటకు వచ్చి.. క్కల్‌ డీఎండీకే పేరుతో డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.