ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు.. కేసీఆర్, తమిళిసైల మధ్య విభేదాలకు తెర!

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య  గత మూడేళ్లుగా రగులుతున్న విభేదాల మంట టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఉన్న అగాధం పూడిపోయింది. ఇంత కాలం ఉప్పు నిప్పులా, విమర్శలు, ప్రతి విమర్శలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు చల్లారిపోయాయి.

ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ తమిళసై దిగజారిస్తే.   గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం, రాజ్ బవన్ ను బీజేపీ కార్యాలయంగా చేశారని ఆరోపించడమే కాకుండా, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా ఇవ్వకుండా అవమానించారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి, మర్యాద గీత దాటేశాయి అనే అంతా అనుకున్నారు. అలాంటిది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీన్ ఒక్క సారిగా మారిపోయింది.  తెలంగాణ బడ్జెట్ కు అనుమతి విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇలా రాజీ కుదిరింది. దీంతో సీన్ మారిపోయింది.  శుక్రవారం (ఫిబ్రవరి 3) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  అంతకు ముందు.  అసెంబ్లీకి వచ్చిన  గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురేగి, గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు.

ఆ తరువాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.   ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం (my government) అంటూ ప్రసంగం ఆరంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అంటూ ప్రస్తుతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిథుల నిర్విరామ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు.

తెలంగాణ సర్కార్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు.  దేశానికే ధాన్యాగరంగా ఆదర్శంగా మారిందన్నారు.  సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి సిద్ధం చేసి ఇచ్చిన ప్రతినే గవర్నర్ తమిళిసై చదివారు. ఎక్కడా తన సొంత అభిప్రాయాలను వెల్లడించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, కొత్త సచివాలయం, వైద్య కళాశాలల పెంపు ఇలా అన్ని అంశాలనూ స్పృశిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.  దీంతో గవర్నర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుతారో అన్న టెన్షన్ తో ఉన్న ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలకు పూర్తిగా తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.