బీజేపీలో ధర్మపురి అర్వింద్ రికార్డు... అప్పుడు కవితను ఓడించి... ఇప్పుడు ఇలా...

 

ధర్మపురి అర్వింద్... ఒకప్పుడు ధర్మపురి శ్రీనివాస్....అదే డీఎస్ కొడుకుగా మాత్రమే కొందరికి తెలుసు... అది కూడా నిజామాబాద్ వరకే అర్వింద్ ఎవరో తెలిసేది... డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేసినా... ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కి సన్నిహితుడిగా మారినా... అర్వింద్ మాత్రం తన సొంత గుర్తింపు కోసం ప్రయత్నించారు. తండ్రి, సోదరుడికి భిన్నంగా బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ కు సొంతంగా బాటలు వేసుకున్నారు. అర్వింద్ బీజేపీలో చేరినప్పుడు ఓ అనామకుడే. తెలంగాణ ముఖ్యనేతలే అర్వింద్ ను పట్టించుకునేవారు కాదు. ఇక ఢిల్లీలో అయితే అర్వింద్ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ నేతలైతే అర్వింద్ ను ఓ పురుగును చూసినట్లు చూసేవారట. దాంతో, రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ అర్వింద్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ పేరు ఢిల్లీలో మారుమోగిపోయిందట. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఓడించిన యువనేతగా అర్వింద్ కి ఒక్కసారిగా గౌరవం పెరిగింది. ఎందుకంటే, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగానే కాకుండా, మంచి వాగ్దాటితో పార్లమెంట్ లో మాట్లాడే కవితకు ఢిల్లీలో మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి కవితను ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ కు బీజేపీ అగ్ర నాయకత్వంలో గుర్తింపు లభించింది.

ధర్మపురి అర్వింద్, ఇప్పుడు, మరో ఘనత సాధించారు. అత్యధిక యాక్టివ్ మెంబర్-షిప్ చేయించి ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీలో అత్యధిక మెంబర్ షిప్ చేయిస్తే ముఖ్యనేతగా గుర్తించే ఆనవాయితీ ఉంది. అందుకే, బీజేపీలో ప్రతి ఒక్కరూ అత్యధిక మెంబర్ షిప్ చేయించేందుకు పోటీపడతారు. అది కూడా యాక్టివ్ మెంబర్ షిప్ చేయిస్తేనే... ముఖ్యమైన నేతగా గుర్తిస్తారు. ఆ కేటగిరిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సత్తా చాటారు. ఇప్పటివరకు 35వేలకు పైగా సభ్యత్వాలు చేయించి దూకుడు మీదున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ సొంత ఐడీపై 35వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. దేశంలో ఏ బీజేపీ లీడరూ... ఈ రేంజ్‌లో మెంబర్‌షిప్స్‌ చేయించలేదని, ఇదొక రికార్డని, కమలనాథులు మాట్లాడుకుంటున్నారు. ధర్మపురి అర్వింద్... తన వ్యక్తిగత ఐడీపై ఈ స్థాయిలో యాక్టివ్ మెంబర్ షిప్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వెబ్ సైట్ లో ధర్మపురి అర్విందే టాప్ లో ఉన్నారు.

బీజేపీలో చేరిననాటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తూచా తప్పకుండా పాటిస్తారనే గుర్తింపు అర్వింద్ కి ఉంది. అంతేకాదు ఏ పని అప్పగించినా సక్సెస్ చేస్తారనే పేరుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భవ పథకం అమలు కాకపోయినా... అమిత్ షా పిలుపు మేరకు అర్వింద్ తన సొంత ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధిష్టానంతో శెభాష్ అనిపించుకున్నారట. ఇప్పుడు, యాక్టివ్ మెంబర్ షిప్ లో దేశంలోనే నెంబర్ వన్ పొజీషన్ దక్కించుకోవడంపై అర్వింద్ అనుచరులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి కవితను ఓడించినప్పుడు ఢిల్లీలో అర్వింద్ పేరు మారుమోగగా, ఇప్పుడు అత్యధిక యాక్టివ్ మెంబర్ షిప్ తో మరోసారి జాతీయ నాయకత్వం దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.