ధర్మానకు ధర్మల్ ఇరకాటం

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంతో అత్మీయుడిగా మెలిగిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంతకాలంగా ఆయన కొత్త పార్టీ పెడతారేమోనని ఓపికగా ఎదురుచూశారు. అయితే అది ఇంకా ఎటూ తేలకపోవడంతో చివరికి దైర్యం చేసి మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైకాపా కండువా కప్పుకొన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో కాకరపల్లి గ్రామం వద్ద స్థాపించబోయే ఒక ధర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ఆ గ్రామ ప్రజలు ఉద్యమించినపుడు, పోలీసు కాల్పులలో ముగ్గురు రైతులు చనిపోయారు. అప్పుడు ధర్మాన ప్రసాదరావు వారికి అండగా నిలబడలేదు. పైగా ప్రాజెక్టు వస్తే స్థానికులకు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని, అందువలన దానిని వ్యతిరేఖించడం అర్ధ రహితమని వాదించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆ ప్రాజెక్టులో ఆయన కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నందునే ఆయన దానికి మద్దతు పలుకుతున్నారని ప్రతిపక్షాల నేతలు ఆరోపించినా ఆయన వాటిని పట్టించుకోలేదు. అయితే, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచి, వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతానని హామీ ఇచ్చారు. ఆయన తన హామీ నిలబెట్టుకొంటారో లేదో తెలియదు. కానీ, ఆయన ఆ ప్రాజెక్టుని వ్యతిరేఖిస్తున్నపుడు కొత్తగా వైకాపాలో చేరిన ధర్మాన ప్రసాదరావు దానికి ఇదివరకులా మద్దతు పలుకలేరు. రానున్న ఎన్నికలలో ఒకవేళ స్థానిక తెదేపా, కాంగ్రెస్ నేతలు మళ్ళీ అక్కడి ప్రజలతో కలిసి ఉద్యమిస్తే వైకాపా కూడా వారితో కలిసి ఆ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ఉద్యమించవలసి వస్తుంది. అప్పుడు ధర్మాన ప్రసాదరావు కూడా వారితో కలిసి ఉద్యమించాల్సి ఉంటుంది. పార్టీ నిర్ణయాన్ని కాదని ఆయన ప్రాజెక్టు స్థాపనకు మొగ్గు చూపలేరు. ఒకవేళ ధిక్కరిస్తే మరో కొత్త పార్టీ వెతుకోవలసి ఉంటుంది.