బ్యాక్ టూ పెవిలియన్... కాని, కొ్త్త ఇన్నింగ్స్!

దేవినేని నెహ్రూ... ఈ పేరు బెజవాడ రాజకీయాల్లో చాలా ఫేమస్. అసలు ఆయన పేరు చెప్పుకోకుండా విజయవాడ పాలిటిక్స్ డిస్కస్ చేయటమే కుదరదు. అంతలా ఒకప్పుడు కృష్ణా తీరాన్ని ఏలారాయన. మరీ ముఖ్యంగా, వంగవీటి ఫ్యామిలీతో గొడవల కారణంగా దేవినేని పేరు మార్మోగిపోయింది ఒక దశలో. అయితే, ఇప్పుడు విజయవాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అమరావతిగా కొత్త సౌరభం సంపాదించుకుంటోంది నగరం. అదే క్రమంలో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నాయి. సరిగ్గా ఈ టైంలో దేవినేని టీడీపిలోకి తిరిగి రావటం ఆసక్తికర పరిణామం...


దేవినేని ప్రస్థానం ఒక విధంగా టీడీపీతోనే ప్రారంభమైంది. ఎన్టీఆర్ పిలుపుతోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. చాలా మంది తొలి తరం టీడీపీ నేతల్లాగే ఉధృతంగా ఎదిగారు. కాని, తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో ముందడుగు వేయలేదు. కాంగ్రెస్ వైపు సాగిపోయారు. వైఎస్ కాలంలో ఓ వెలుగు వెలిగారు. ఎప్పటిలాగే బెజవాడ పాలిటిక్స్ లో కీలకంగా కొనసాగారు.


వైఎస్ మరణం తరువాత జగన్ శిబిరంలోకి వెళ్లని దేవినేని నవ్యాంధ్ర ఏర్పాటు తరువాత కూడా కాంగ్రెస్ లోనే ఇంత కాలం వున్నారు. అయితే, రోజురోజుకి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారుతుండటం... అలాగే, రాష్ట్ర రాజకీయాలు మొత్తం టీడీపీ, వైసీపీల మధ్యే ఇమిడిపోవటం దేవినేనికి పార్టీ మారక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టాయి. అయితే, ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే దేవినేని టీడీపీ జాయినింగ్ పుట్టింటికి రావటం లాంటిదే! స్వంత ఇంటికి చేరుకున్నారు దేవినేని. కాకపోతే, ఆయనతో పాటూ ఆయన కుమారుడు అవినాష్ కూడా పార్టీలోకి రావటం చెప్పుకోతగ్గ అంశం...


దేవినేని వారసుడుగా ప్రస్తుతం రాజకీయాల్లో వున్న అవినాష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేశాడు. అయితే, విభజన కారణంగా వీచిన ప్రతికూల గాలుల్లో ఓటమి తప్పలేదు. ఆయన చేరికతో టీడీపీకి విజయవాడలో తిరుగులేకుండా పోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పటి దాకా కాంగ్రెస్ దేవినేని కుటుంబం సాయంతోనే బెజవాడలో బండి నెట్టుకొస్తోంది. అలాంటిది ఆల్రెడీ దేవినేని ఉమా, వంశీ, నాని లాంటి నాయకులతో బలంగా వున్న టీడీపీలోకి దేవినేని కుటుంబం కూడా చేరిపోవటం సైకిల్ హవాకి తిరుగులేకుండా చేస్తుంది. మరో వైపు , కాంగ్రెస్ కహానీ ఖతమ్ అని కూడా డౌట్ లేకుండా చెప్పొచ్చు!


దేవినేని చేరికతో టీడీపికి లాభమే కాదు... స్వంత పార్టీలో చేరిన ఆయన కూడా బాగానే లాభపడే అవకాశం వుంది. అమరావతి అభివృద్ధిలో బాగస్వామిని అవుతా అని చెప్పటం ద్వారా ఆయన భవిష్యత్ ని సూచించారనుకోవాలి. నవ్యాంధ్రకి రాజధాని అయిన విజయవాడలో ఖచ్చితంగా రాజకీయం బ్రహ్మాండంగా వుంటుంది మున్ముందు. అటువంటి నేపథ్యంలో దేవినేని యువనేతగా వున్న కొడుకుతో సహా టీడీపీలో చేరటం ప్రాఫిటబుల్ డీలే. దేవినేని నెహ్రు సామాజిక వర్గం మొత్తం ఎలాగూ బలంగా టీడీపీ వెంటే వుంటుంది కాబట్టి వైసీపికి వ్యతిరేకంగా ఆయన సైకిల్ ఎక్కటం ఏ విధంగా చూసినా తెలివైన నిర్ణయమే!