కర్రలతో చితక్కొట్టుకున్నారు.. దేవరగట్టు బన్ని ఉత్సవంలో 50 మందికి గాయాలు 

దసరా పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కర్నూల్ జిల్లా హెలగుంద దేవరగట్టు. దసరా రోజున అక్కడ జరిగే బన్ని ఉత్సవం. కళ్లలో భక్తి.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం.. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. కర్రలతో దొరికిన వాళ్ళని దొరికినట్లు చితగ్గొడితే దేవుడు కరుణిస్తాడు. ఇదే ఇక్కడి సంప్రదాయం.. ఆనవాయితీ కూడా. ప్రతి ఏటా బన్ని ఉత్సవంపై పోలీసులు ఆంక్షలు పెట్టడం, కర్రలతో కొట్టుకోకుండా చూస్తామని ప్రకటనలు చేయడం... కాని పండుగ రోజున ఎప్పటిలానే కర్రల సమరం జరగడం.. రక్తమోడడం జరుగుతూనే  ఉంటుంది. 

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం ఈ ఏడాది కూడా అంతే భక్తితో అంతే విశ్వాసంతో అంతే హింసతో నిర్వహించారు. ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలతో భక్తులు బీభత్సంగా కొట్టుకున్నారు. సుమారుగా ఈ హింసలో 50 మందికిపైగా భక్తులు తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరగట్టులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు. బన్ని ఉత్సవంలో కర్రలను అరికడతామన్న పోలీసులు చివరికి ప్రేక్షక పాత్ర వహించారు.

ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. అధికారులు, ప్రభుత్వం కళ్ళెదుటే హింస జరుగుతుంటే.. పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించింది.అయినా ఈసారి కూడా కర్రల సమరం జరిగింది.