ఢిల్లీ పీఠం దక్కేదెవరికి?

 

ఈ రోజు జరుగనున్న డిల్లీ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, అమ్ ఆద్మీ పార్టీలకు చాలా కీలకమయినవి. మూడు సార్లు వరుసగా డిల్లీ పీఠం దక్కించుకొన్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా దక్కించుకొనగలిగితే, అది కాంగ్రెస్ సుపరిపాలనను డిల్లీ ప్రజలు మెచ్చి పట్టం కట్టినట్లవుతుంది గనుక, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకు సానుకూల సందేశం అందిస్తుందని ఆశిస్తోంది. వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా డిల్లీని పాలిస్తున్నషీలా దీక్షిత్ ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

ఇక నరేంద్రమోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో గెలిచి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈసారి ఎలాగయినా డిల్లీ పీఠం దక్కించుకొని తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతూ అందుకోసం తీవ్రంగా శ్రమించింది. గత మూడు ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో భంగపడిన బీజేపీ ఈసారి తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా మార్చి డిల్లీలో మంచి పేరున్న డా.హర్ష వర్ధన్ ని తన అభ్యర్ధిగా ప్రకటించింది.

 

సామాజిక కార్యకర్త, ఒకప్పటి అన్నాహజారే అనుచరుడు అయిన అరవింద్ కేజ్రీ వాల్ స్థాపించిన అమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండు పెద్ద పార్టీల ఆశలకు గండి కొట్టవచ్చని సర్వేలు చాటుతున్నాయి. అయితే అమ్ ఆద్మీ పార్టీ గెలిచినా, గెలవకున్నాకాంగ్రెస్, బీజేపీల ఓట్లను చీల్చి వాటిని అధికారంలోకి రాకుండా అడ్డుపడగల శక్తి ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

 

అమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల చిహ్నమయిన ‘చీపురుకట్ట’తో కలుషిత రాజకీయాలను పూర్తిగా తుడిచేసి, డిల్లీ వాసులకు నిజమయిన సుపరిపాలన అందిస్తానని ఇస్తున్నహామీలు డిల్లీ ప్రజలను బాగా ఆకర్షిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలు లోలోన చాలా కలవరపడుతున్నపటికీ, పైకి మాత్రం అసలు అమ్ ఆద్మీ పార్టీ లెక్కలోకే రాదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ఈసారి ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

 

కాంగ్రెస్, బీజేపీలు బ్రష్ట రాజకీయాలు చేస్తున్నాయని ఎన్నికలలో తెగ ప్రచారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, మళ్ళీ వాటికే మద్దతు ఇస్తారా లేక వాటి మద్దతుతోనే ముఖ్యమంత్రి అవుతారా? అనేది ఆసక్తికరం. అదే జరిగితే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కలుషిత రాజకీయ వ్యవస్థలో ఒక భాగమయిపోవడం ఖాయం.

 

ఈ రోజు జరిగే ఎన్నికలలో 70 శాసనసభ సీట్లకు మొత్తం 810మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 1.19 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. కొద్ది సేపటి క్రితమే పోలింగ్ కూడా మొదలయింది. డిల్లీతో సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, మిజోరం ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu