12మందికి ఉరిశిక్ష‌.. హైవే కిల్ల‌ర్స్‌ మున్నా గ్యాంగ్ ఖేల్ ఖ‌తం..

మున్నా గ్యాంగ్‌. ఇప్పుడు విన‌డానికి కొత్త‌గా ఉన్నా.. ఒక‌ప్పుడు ఫుల్ టెర్ర‌ర్‌. వాళ్లు మ‌నుషులు కాదు. మృగాలు. మ‌హా ఖ‌త‌ర్నాక్‌. న‌ర‌రూప రాక్ష‌సుల్లాంటి దోపిడీ దొంగ‌లు. అత్యంత క్రూరంగా హ‌త్య‌లు చేసిన కిరాత‌కులు. హైవేలే వారి క్రైమ్ స్పాట్‌లు. ఐర‌న్ లోడ్‌తో వెళ్తున్న లారీలే వారి టార్గెట్‌లు. 

అర్థ‌రాత్రి హైవేల‌పై ఆయుధాలు చూపించి లారీల‌ను ఆప‌డం.. డ్రైవ‌ర్లు, క్లీన‌ర్ల‌ను దారుణంగా చంప‌డం. శ‌వాలు దొర‌క్కుండా పాతేయ‌డం. లారీతో స‌హా స‌రుకు లూటీ చేయ‌డం. ఐర‌న్ లోడ్‌తో పాటు లారీనీ ముక్క‌లు ముక్క‌లు చేసి అమ్మేయ‌డం వారి ప‌ని. ఇదీ వారు చేసిన నేరాలు-ఘోరాల చ‌రిత్ర‌. ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. 7 ఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది డ్రైవ‌ర్లు, క్లీన‌ర్ల‌ను హ‌త్య చేసిన ఆ హంత‌కుల ముఠాకు 13 ఏళ్ల త‌ర్వాత తాజాగా క‌ఠిన శిక్ష ప‌డింది.  హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 18 మంది నిందితుల్లో 12 మందికి ఉరిశిక్ష ప‌డింది. మ‌రో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వ‌చ్చింది. 

ప్ర‌కాశం జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. ఈ ముఠా పాల్పడిన దారుణాలపై జిల్లాలోని ఒంగోలు తాలుకా, సింగరాయకొండ, మద్దిపాడు పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ప్రకాశం-నెల్లూరు జిల్లా మధ్య హైవేపై మున్నా గ్యాంగ్ సాగించిన మారణకాండ క్రైమ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ, హ‌త్య‌లు చేసేది మున్నా గ్యాంగ్. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ ప‌ట్టుకొని ఉండడంతో వారు నిజంగానే అధికారులని భావించి లారీ డ్రైవర్లు వాహనాలు ఆపేవారు. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. దోపిడీ చేసిన ఐరన్ లోడును గుంటూరులో అమ్మేవారు.

ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేశారు. డ్రైవర్, క్లీనర్‌ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకెళుతుండగా.. తెట్టువద్ద ఆపి డ్రైవర్‌ భూషణ్‌యాదవ్, క్లీనర్‌ చందన్‌ కుమార్‌ మెహతోలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు.

తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడకు ఇనుప యాంగ్యులర్‌లతో బయల్దేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్‌కుమార్‌లను దారుణంగా హత్యచేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్‌కు చెందిన లారీని కూడా ఇదేవిధంగా ఆపి డ్రైవర్‌ను హతమార్చి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ ఒడ్డున చిల్లచెట్లలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద లీజుకు తీసుకున్న టుబాకోస్‌ వెనుక గోడౌన్‌లో ముక్కలు చేసినట్టు గుర్తించారు.

తమిళనాడుకు చెందిన ఒక లారీ యజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మున్నా గ్యాంగ్ ఆటకట్టించారు. పాత ఇనుమును కొనే వ్యాపారులపై దృష్టి పెట్టి, మున్నా కదలికలు గుర్తించారు. ఓ దశలో దేశం వదిలి పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్న మున్నాను కర్ణాటకలో ఓ ఫాంహౌస్ ద‌గ్గ‌ర‌ అరెస్ట్ చేశారు. ఆ ఫాంహౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేది. మొత్తం నాలుగు కేసుల్లో మున్నాతో పాటు 18మందిపై నేరం రుజువు కావ‌డంతో.. ఏకంగా 12మందికి ఉరిశిక్ష విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. దారుణ‌మైన హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు కాబ‌ట్టే.. వీరికి ఉరి శిక్ష విధించింది కోర్టు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu