టీడీపీకి పవన్ పంచ్.. 26 న జనసేన తొలి జాబితా!!

 

ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతామని ప్రకటిస్తుంటే.. మరోవైపు ఎన్నికల సమయానికి పవన్ టీడీపీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం గురించి వైసీపీ నేతలు విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టారు. దీంతో పవన్ తమపై వస్తున్న వార్తలకు, విమర్శలకు ఒకేసారి చెక్ పెట్టడానికి అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంలో ప్రధాన పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసే పనిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మిగతా వారి కంటే ఓ అడుగు ముందున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ముహుర్తం ఖరారు చేశారని సమాచారం. టీడీపీతో పొత్తు అని వార్తలొస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటిస్తే తాము ఎవరితో లేమనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని పవన్ భావిస్తున్నారట.

తొలి జాబితాలో తూర్పుగోదావరి, గుంటూరు, అనంతరపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన ఉండే చాన్స్ ఉంది. ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నందున కొత్త అభ్యర్థులతో పాటు, ఇప్పటికే ఎమ్మెల్సేలుగా పనిచేసి జనసేనలో చేరిన వారి పేర్లు తొలి జాబితాలో ఉన్నట్లు సమాచారం. జనసేన తొలి అభ్యర్థిగా ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. ఇక రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, గన్నవరం నుంచి పాముల రాజేశ్వరీ, మండపేల నుంచి దొమ్మటి వేంకటేశ్వర్లు, రాజోలు నుంచి రాపాక వరపరసాద్ పేర్లు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ పేర్లు తొలిలిస్టులో ఉండే అవకాశం ఉంది. కాగా అనంతపురం నుంచి ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ఉంటున్న ఇద్దరి పేర్లపై పవన్ దృష్టిసారించినట్లు సమాచారం. వీరి పేర్లు కూడా తొలి జాబితాలో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.