నేను రాజకీయాలకు పనికిరాను.. పవన్ నిజాయతీగా ఉంటాడు
posted on May 4, 2016 11:28AM

దర్శకరత్న దాసరి నారయణరావు ఈరోజు తన 72వ పుట్టిరోజు జరుపుకుంటున్నారు. ఈసందర్బంగా దాసరి మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలని.. హైదరాబాద్లో రెండు వేల ఎకరాలు సినిమా హబ్ కు కేటాయించి.. దీనికోసం పలు సలహాలు, సూచనల కోసం తనను అడగటానికి ప్రభుత్వమే దగ్గరుండి కమిటీని ఏర్పాటు చేయడం విశేషం అన్నారు. ఇంకా ఏపీలో కూడా సినిమాలకు సంబంధించిన మౌళిక వసతులు మరిన్ని కల్పించాలన్నారు. షూటింగుల కోసం పర్మిషన్లు దొరకడం కష్టమవుతోందని, సింగిల్ విండో పద్ధతిన అనుమతులు మంజూరు చేస్తే బాగుంటుందన్నారు.
అంతేకాదు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, తన లాంటి వాళ్లు ప్రస్తుత రాజకీయాలకు పనికిరారని, వెళ్తే బురద చల్లించుకొని రావాలని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు.
ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..అతను ముక్కుసూటి మనిషి అని, నిజాయతీగా ఉంటాడని, ఓ మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం గలవాడని, అతను రాజకీయాల్లోకి రావడం సంతోషకరమైన విషయమేనని, పవన్ రాణిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.