ఈయన సేవకి... చేతులెత్తి 'మొక్క'వలసిందే!

మరోసారి జనవరి 26 వచ్చింది. పోయింది. గణతంత్రం ఘనంగా జరుపుకున్నాం. జెండా వందనం చేసుకున్నాం. కాని, ఒక్కసారి మన జెండా రెపరెపల మాటున  ఎజెండా ఏంటని ఆలోచించుకున్నామా? ఈ మధ్య పదే పదే వార్తల్లో వస్తోన్న విషయం ఏంటో గమనించారా? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం! ఇక్కడ హైద్రాబాద్ లో వుండే మనకు అంతగా అర్థం కాకపోవచ్చుగాని దేశ ప్రధాన నగరంలో పరిస్థితి దారుణంగా వుంది. అస్తమా నుంచి క్యాన్సర్ వరకూ కాలుష్యం కారణంగా సోకని రొగమంటూ లేదు జనానికి. మిగతా నగరాలు, పట్టణాలు, ఆఖరుకి గ్రామాల్లో కూడా రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతూనే వుంది. ఢిల్లీ అంత కాలుష్యం అంతటా లేకున్నా ఎక్కడా స్వచ్ఛమైన గాలీ, చూడచక్కని ప్రకృతి కనిపించటం లేదు. పచ్చ నోట్ల ధ్యాసలో .. మనిషి పచ్చదనాన్ని పాతరేసేస్తున్నాడు! ఆత్మహత్యకి సిద్ధమవుతున్నాడు... 

 

 

జనవరి 26న ఎప్పటి లాగే ఈ సారి కూడా పద్మా అవార్డులు ఇచ్చారు. మన తెలుగు వ్యక్తికి కూడా ఒకాయనకి పద్మ అవార్డు దక్కింది. ఇందులో సాధారణంగా అయితే విశేషం ఏం లేదు. కాని, వాతావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలోనే ఆయన తన పద్మ శ్రీ అందుకున్నాడు. ఆయన గత అయిదు దశాబ్దాలుగా చేస్తున్న పనే కాలుష్యానికి విరుగుడు. ఆయనకి మోదీ సర్కార్ సగౌరవంగా పద్మా అందజేసింది! ఇది భారతీయులుగా, తెలుగు వారిగా మనం సంతోషించాల్సిన విషయమే! కాని, ఖమ్మం జిల్లాల్లోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన చెప్పేది ఆచరిస్తే మరింత గొప్పగా వుంటుంది. ఆయనకి అవార్డ్ ఇవ్వటం గొప్ప విషయమే కావచ్చు.. కాని, ఆయన చెప్పేది పట్టించుకోకపోవటం మన భవిష్యత్ ని మనమే చంపేసుకోవటం! అదే పెను విషాదం... 

 

 

దరిపల్లి రామయ్య... తలకి హెల్మెట్ లాగా , టోపీ లాగా ఒక అట్టతో చేసిన చక్రం బిగించుకుంటాడు. అది అలంకారం మాత్రం కాదు. అదొక సందేశం లాంటి ఆదేశం! వృక్షో రక్షతి రక్షితః అన్నది దరిపల్లి రామయ్య అందరికీ చెప్పే జీవిత సత్యం! జీవాన్నిచ్చే సత్యం! 

 

 

చెట్లు నాటమని చెప్పేవారు బోలెడు మంది వుంటారు భూమ్మీద. కాని, తీరా తాము ఇల్లు కట్టుకునే సమయం వస్తే నిర్ధాక్షిణ్యంగా ఎన్ని చెట్లైనా నరికేస్తారు. చివరకు, కార్ పార్కింగ్ చేసుకోవటం ఇబ్బంది అవుతోందని కూడా చెట్లు నరికేసే రాక్షసులు తయారయ్యారు ప్రపంచంలో. అలాంటి ఒట్టి మాటల మనిషి కాడు రామయ్య. ఆయన తన చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని వేప చెట్లు గాలికి కూలిపోతే వాట్ని చూసి ప్రేరణ పొందాడు. ఎందుకంటే, అవ్వి ఇప్పుడు అరవై ఏళ్లున్న రామయ్య ముత్తాత నాటినవి.

 

 

వందల సంవత్సరాల కిందటి ఆ వేప చెట్లు రామయ్య చిన్నతనంలో కూలిపోయాయి. అవ్వి కూలిన నాడు రామయ్య ముత్తాత పేరు చెప్పి అవ్వి ఆయన చెట్లేనని అన్నారట గ్రామస్థులు! అప్పుట్నుంచీ చెట్లు నాటటం అంటే తరతరాల మీద తన ప్రభావం చూపటమేననే విషయం రామయ్యకి అర్థమైంది. అందుకే, బడికి పోయే వయస్సు నుంచే చెట్లు నాటటం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకూ కోటి మొక్కలు నాటి, రెండు కోట్ల మొక్కలకు సరిపడా విత్తనాలు వెదజల్లి... ఈ భూమికి తన దైన పచ్చటి వారసత్వాన్ని బహుకరించాడు! చెట్లు నరకటమే అభివృద్ధిగా చెలామణి  అవుతున్న ప్రస్తుత తరుణంలో చెట్లు నాటుతూ, ఉచితంగా పంచుతూ, నాటమని జనం మనస్సుల్లో నాటుకునేలా చెబుతూ యావజ్జీవితం గడిపేశాడు! మొక్క కోసం మొక్కవోని కృషి చేస్తున్నాడు!

 

 

దరిపల్లి రామయ్య తన భార్యతో కలిసి దశాబ్దాలుగా చెట్లు నాటడమే జీవితంగా గడుపుతున్నాడు. అందరిలాగే ఆయనకు పిల్లలు, సంసారం అన్నీ వున్నా ప్రధాన వ్యాపకం పచ్చదనమే. పచ్చ నోట్ల వెంట పరుగులు తీసి జీవిత చరమాంకంలో ఏమీ సాధించలేకపోయేమే అన్న బాధ పడేవాళ్లలా కాదయన. భావి తరాలకి పచ్చటి వారసత్వం తన, పరా బేధం లేకుండా అందిస్తున్నాడు. మొదట్లో కాలినడకన ఉచితంగా చెట్లు అందిస్తూ తిరిగిన ఆయన తరువాత చంద్రబాబు అందించిన సైకిల్ పై మొక్కలు పంపిణీ చేశాడు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి హయాంలో టీవీఎస్ అందుకుని దానిపై కూడా తన వృక్షాల వృత్తాంతాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.

 

ఇప్పుడు కేసీఆర్ శకంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు పై కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ పురస్కారం అందుకున్నాడు. ముఖ్య మంత్రులు మారిన దరిపల్లి రామయ్య దారి మాత్రం మారలేదు. పచ్చటి మొక్కల వెంట ఆయన సాగిపోతూనే వున్నాడు. దేవుడికి మొక్కుకోవటం ఎంత ముఖ్యమో... అంతే ముఖ్యం, ఆ దేవుడికి పళ్లు, పూలు ఇచ్చే మొక్కల్ని నాటడం అంటాడయాన! యావత్ దేశం , ప్రపంచం కాలుష్యపు కొండ చిలువ నోటిలో చిక్కిన ప్రస్తుత తరుణంలో.. అంతకంటే గొప్ప సందేశం ఏం కావాలి? అందుకే, ఆయనని ఒకప్పుడు పిచ్చివాడని అనుకున్న జనం పద్మ శ్రీతో పాటూ అనేకానేక అవార్డులు అందుకుంటుంటే.... పిచ్చి ఎవరికి పట్టిందో గ్రహిస్తున్నారు! పచ్చదనాన్ని పచ్చి అభివృద్ధి మోజులో పడి పాడు చేసుకుంటోన్న అత్యధికులే పిచ్చి వాళ్లు! రామయ్య లాంటి ఒకరిద్దరు ప్రకృతి ఆరాధకులే అసలైన సంపన్నులు!