TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన: నష్టం అంచనా, కేంద్రానికి నివేదిక.!

Published on: Fri Nov 13, 2026 3:47PM

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన  మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో  2,484.43 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో వెల్లడైంది. రాష్ట్రంలోని 106 మండలాలు, 315 గ్రామాల పరిధిలో దాదాపు 1.93 లక్షల మంది ప్రజలు ఈ తుపాను ప్రభావానికి గురయ్యారని రాష్ట్ర అధికారులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి నివేదించారు.

తుపాను నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేస్తున్న అంతర మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం  , విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించింది. నవంబర్ 12వ తేదీ వరకు సేకరించిన నష్టాల అంచనాలను, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస మరియు పునరుద్ధరణ చర్యలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. తుపాను తీరం దాటిన  రెండు రోజుల్లోనే విద్యుత్ సరఫరా, మొబైల్ కనెక్టివిటీ,  రోడ్డు రవాణాను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను కేంద్ర బృందం   అభినందించింది. అలాగే, సహాయక చర్యల్లో పాల్గొన్నఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్  సేవలను ప్రశంసించింది.

కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం రహదారులు,  భవనాల శాఖకు  అత్యధికంగా  889 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే  వ్యవసాయ శాఖకు   875 కోట్ల రూపాయల నష్టంవాటిల్లింది. ఉద్యానవన శాఖకు 337 కోట్లు, నీటిపారుదలకు136 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు,119 కోట్లు, విద్యుత్ శాఖకు54 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.  

మురసు తుపాను ధాటికి 1.43 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 6,756 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.   3,859 ఇళ్లు,   1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి,  ఏలూరు జిల్లాలు ఈ తుపాను వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యాయి.ఇక పోతే తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 536 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, 31,080 మందికి సురక్షిత ఆశ్రయం కల్పించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు 3,066 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలించారు.

ఇది కూడా చదవండి:  పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పుకణం: చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు.!

ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం 253 వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు, 12,967 మత్స్యకార పడవలు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా నిలువరించింది. సహాయక చర్యల కోసం మొత్తం 13 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ఈ ఏడు జిల్లాల్లో మొత్తం 1,93,769 మంది ప్రజలు తుపాను వల్ల ఇబ్బందులు పడినట్లు అధికారులు తెలిపారు.

పంట పొలాలు, మౌలిక సదుపాయాలు మరియు నివాస గృహాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాలు ఇప్పటికే బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా శనివారం (నవంబర్ 14) పల్నాడు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి.  క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత, కేంద్ర బృందం సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాయి. తుపాను తీవ్రతను అంచనా వేయడానికి మరియు రాష్ట్రానికి అందించాల్సిన విపత్తు సహాయ, పునర్నిర్మాణ నిధుల మంజూరుకు ఈ నివేదిక కీలకం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,484.43 కోట్లుగా ప్రాథమిక నష్టాన్ని అంచనా వేయగా, కేంద్ర బృందం తనిఖీల అనంతరం తుది నష్టం విలువ ఖరారు కానుంది.

మీకు నచ్చవచ్చు: తీరం దాటిన మురసు: బాపట్లలో వర్ష బీభత్సం: తెల్లవారు జామున చంద్రబాబు సమీక్ష.!

మురసు తుఫానుతో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం.!

[Cyclone Murasu, AndhraPradesh Loss,   Damage Assessment, Central Teams,  TeluguOne]