అఖిలపక్షానికి మోడీ డుమ్మా.. సర్వత్రా విమర్శలు

జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిపై  చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని  నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దాడి అనంతరం రెండు రోజుల పాటు వ్యూహాత్మక మౌనంతో మోడీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అఖల పక్ష సమావేశంలో అందరి అనుమానాలూ, సందేహాలూ నివృత్తి చేస్తారనీ, అన్నిప్రశ్నలకూ సమాధానాలు చెబుతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రధాని మోడీ  అఖిల పక్ష సమావేశానికి గైర్హాజరు కావడం,  బీహార్ లో ఎన్నికల ప్రసంగం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం సర్వత్రా  విమర్శలకు తావిచ్చింది. రక్ణణ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి అన్ని  రాజకీయ పార్టీల ప్రతినిథులూ హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధాని  పహెల్గాం  దాడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనీ, ఈ దాడి  తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తతారనీ, అలాగే భద్రతా లోపాల  గురించి ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు చెబుతారనీ అంతా భావించారు.

అయితే ప్రధాని మోడీ..అత్యంత కీలకమైన ఈ భేటీకి గైర్హాజరు కావడం, ఇంతటీ కీలక భేటీ కంటే బీహార్ లో సభ ద్వారా రాజకీయ లబ్థి పొందడమే ముఖ్యమనుకోవడం పట్ల సర్వతత్రా అసంతృప్తి, అసహనం వ్యక్తమైంది. ఇదే అసంతృప్తి, అసహనాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్  వేదిక ద్వారా వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? ఇది భద్రతా లోపం, పహెల్గాం దాడి.. నిఘా వర్గాల వైఫల్యం,   పోలీసు వైఫల్యం వంటి అంశాలపై  అఖిలపక్షంలో మోడీ క్లారిటీ ఇస్తారని  భావించామనీ, అయితే ఆయన డుమ్మా కొట్టడం తమను తీవ్ర నిరాశకు  లోను చేసిందనీ ఖర్గే పేర్కొన్నారు.  అయితే దేశంలో ఉగ్రవాదాన్ని  తుదముట్టించే విషయంలో తాము  ప్రభుత్వం తీసుకునే చర్యలు, నిర్ణయాలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అయితే మోడీ వైఖరి ఎంత మాత్రం సమర్ధనీయం  కాదని  విమర్శించారు.