ఏపీలో కొవిడ్ టీకాల కొరత? 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 11 నుంచి దేశ వ్యాప్తంగా టీకా మహోత్సవం నిర్వహించాలని అన్ని రాష్ట్రాల సీఎం లకు ప్రధాని మోడీ సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సరిపడా కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం కేవలం  2 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.  ఒకటి రెండు రోజుల్లో ఉన్న  స్టాక్ కూడా అయిపోతుందని అంటున్నారు. 

ఏపీలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలనుకుంటున్న జగన్ సర్కార్ కు... వ్యాక్సిన్ల కొరత ఆటంకాలు కల్పించేలా ఉంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి .. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ చక్కగా సాగుతోందని.. కరోనా నివారణకు కేంద్రం సూచించిన చర్యలు ఏపీ ప్రభుత్వం పాటిస్తోందని లేఖలో చెప్పారు జగన్. కరోనా కట్టడిలో కేంద్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని  చెప్పారు. ప్రధాని సూచన మేరకు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు టీకా మహోత్సవం నిర్వహిస్తామని.. అయితే అందుకు అత్యవసరంగా 25 లక్షల వ్యాక్సిన్ డోస్ లు అవసరం ఉన్నాయంటూ లేఖలో  వెల్లడించారు సీఎం జగన్. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతోందని లేఖలో గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామన్నారు. టీకా మహోత్సవంలో ఏపీ పాల్గొనాలి అంటే తక్షణమే అవసరానికి సరిపడే విధంగా 25 లక్షల డోసులు పంపాలని లేఖలో జగన్ కోరారు. జగన్ లేఖను బట్టే ఏపీలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాక్ లెక్కలు, మంత్రి చెప్పిన మాటలు బట్టి చూస్తే..  మరో రెండు రోజులకు సరిపడినంత స్టాక్ మాత్రమే ఉంది. తరువాత కూడా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగాలి అంటే కేంద్ర నుంచి త్వరగా వ్యాక్సిన్ రావాలి. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కు డిమాండ్ పెరుగుతోంది. మరి అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసే అంత స్టాక్ కేంద్రం దగ్గర ఉందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు.