రెండు జోన్లలోనే 409 కేసులు.. హైదరాబాద్ లో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మహమ్మారి పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే కేసులు మూడింతలు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం నిర్వహించిన పరీక్షల్లో గ్రేటర్ పరిధిలో భారీగా కేసులు వచ్చాయని తెలుస్తోంది.

ఉప్పల్‌, మల్కాజిగిరి ఆస్పత్రుల పరిధిలోనే  గురువారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 409 మందికి కరోనా సోకినట్లు ఆయా ఆస్పత్రుల వైద్యులు తెలిపారు. ఉప్పల్‌ పీహెచ్‌సీలో 127 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 50 మందికి పాజిటివ్‌  వచ్చింది. సఫిల్‌గూడ ఆస్పత్రిలో 74 మందికి పరీక్షలుచేయగా 5 మందికి  పాజిటివ్‌ వచ్చింది . మౌలాలిలో 85 మందికి గాను 8 మందికి.. ఏకలవ్యనగర్‌ ఆసుపత్రిలో 86 మందికి గాను 21మందికి పాజిటివ్‌ వచ్చింది. వినాయక్‌నగర్‌ 75 మంది  15 మందికి.. మల్కాజిగిరి ఆసుపత్రిలో 293 మందికి గాను 95 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయింది. కుషాయిగూడ ఆసుపత్రిలో 170 మందికి గాను 48 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు చెప్పారు. జవహర్‌నగర్‌ ఆసుపత్రిలో 54 మందికి గాను 15 మందికి పాజిటివ్‌ అల్వాల్‌ ఆసుపత్రిలో 189 మందికి గాను 160 మందికి పాజిటివ్‌ వచ్చింది.

రెండు జోన్ల పరిధిలోనే నాలుగు వందలకు పైగా కేసులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ విస్తరిస్తోందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కరోనా పరీక్షల కోసం  బారులు కనిపిస్తున్నాయి. పరీక్షలు చేసే కేంద్రాలను పెంచాలని, ఎక్కవ మందికి పరీక్షలు చేసేలా ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.