ఆస్ట్రేలియా నుంచి వచ్చి.. ప్రేమ జంట దుర్మరణం.. పిల్ల‌ల‌కు తీవ్ర‌గాయాలు..

వాళ్లది ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆస్ట్రేలియా వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా సెటిల్ అయ్యారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. మంచి జీవితం. మంచి సంపాద‌న‌. త‌ల్లిదండ్రులంటే ప్రేమ‌. అందుకే, ప్ర‌తీ ఏటా ఇండియా వ‌చ్చేవారు. పేరెంట్స్‌తో కొన్నాళ్లు గ‌డిపి తిరిగి వెళ్తుండేవారు. క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా వారు స్వ‌గ్రామం రాలేదు. చాలా కాలం త‌ర్వాత ఇటీవ‌ల స్వ‌దేశానికి వ‌చ్చారు. ఆనందంతో స్వ‌గ్రామానికి కారులో బ‌య‌లు దేరారు. కానీ, కారు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంతో వారిక‌దే అంతిమ ప్రయాణం అయింది. అతివేగంతో కారు న‌డిపడంతో అదుపు త‌ప్పి.. డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాదంలో ఆ దంప‌తులు ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఇద్ద‌రు పిల్ల‌లు, డ్రైవ‌ర్‌కు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న వారి కుటుంబంలో తీవ్ర విషాధం నింపింది. 

ఈ ప్ర‌మాదం హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జ‌రిగింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడేనికి చెందిన పెదగమళ్ల హేమాంబరధర్‌ (45), రజిత (39) పదకొండేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. వీరికి కుమార్తె భవజ్ఞ (9), కుమారుడు ఫర్విత్‌(6) ఉన్నారు. రజిత తండ్రి ఆరు నెలల క్రితం చనిపోయారు. క‌రోనా కార‌ణంగా అప్పుడు రాలేకపోయారు. ఈనెల 25న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ షాపింగ్‌, ఇతర పనులు చూసుకొని.. రాత్రి రెడ్డిగూడెం బయల్దేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి ద‌గ్గ‌ర‌కు రాగానే ఓవ‌ర్ స్పీడ్‌ కారణంగా కారు డివైడర్‌ను ఢీకొంది. ప్రమాదంలో హేమాంబరధర్‌, ర‌జిత అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారులు భవజ్ఞ, ఫర్విత్‌తో పాటు డ్రైవర్‌ తిరుపతిరావుకు గాయాలయ్యాయి.

సాయంత్రం రెడ్డిగూడేనికి చేరుకున్న మృతదేహాలను చూసిన కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. కన్నబిడ్డలు ఇంటికి వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో మృతుడి త‌ల్లిదండ్రులు హృదయవిదారకంగా రోధించారు. 

అందుకే, వాహ‌నం న‌డిపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌. అతివేగం ప్రాణాంత‌కం. స్పీడ్ థ్రిల్స్‌, బ‌ట్ కిల్స్‌. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu