కుల చిచ్చు రగిల్చే కుట్ర.. మంత్రులూ మీకిది తగునా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరార్ధం బ్రాహ్మణార్ధం అన్నట్లుగా చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై జిల్లాలలో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోనే చిచ్చు రాజుకుంది. వైఎస్సార్ జిల్లాను రెండుగా చేసి రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనాపై రాజంపేట వాసులు భగ్గుమంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 

అదలా ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరొందిన విజయవాడ కేంద్రంగా ప్రతిపాదించిన కొత్త జిల్లాకు ప్రభుత్వం ‘ఎన్టీఆర్’ పేరును ప్రతిపాదించింది. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ మీద గౌరవంతో, ఈ నిర్ణయం తీసుకుందా, కులాల మద్య చిచ్చు పెట్టేందుకే కుట్ర చేస్తోందా అంటే రెండవదే నిజం అనిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ  ప్రతిపాదనను  తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని,వ్యతికేంచాలనీ వైసీపీ ఆశించింది. ఆవిధంగా, ఎన్టీఆర్’ ను తెలుగు దేశం పార్టీకి దూరం చేయవచ్చనే ఆలోచన చేసింది.అయితే, వైసీపీ కుట్రను ముందుగానే పసిగట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జగన్ రెడ్డి సర్కార్’కు చురకలు అంటించారు.సర్కార్ కపట నాటకాన్ని బయట పెట్టారు. అందుకే, ఎన్టీఆర్‌ను ఎవ‌రు గౌర‌వించినా తాము స్వాగ‌తిస్తామన్నారు. అయితే ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాద‌ని.. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని గుర్తు చేశారు.అలాగే, ఓ వంక రాష్ట్రంలో ఎక్కడికక్కడ  ఎన్టీఆర్ విగ్రహలాను ధ్వంసం చేస్తూ.. మరో వంక ఎన్టీఆర్ పట్ల  తమకు  ప్రేమ ఉన్నట్లు నటిస్తే ప్రజలు నమ్మరని టీడీపీ నాయకులు చురకలు అంటించారు. అలాగే, అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్టును నిలిపి వేసిన  జ‌గ‌న్ ప్రభుత్వం ఎన్టీఆర్‌పై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మర‌న్నారు. చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీన్‌లను కూడా జ‌గ‌న్ నిలిపి వెయ్యడం నిజం కాదా, అని ప్రశ్నిస్తున్నారు. దీంతో  వైసీపీ  నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అందుకే వైసీపీ, ప్రభుత్వం కొత్త  ఎత్తులు వేస్తున్నాయని అంటున్నారు.
అదలా ఉంటే, మంత్రులు పేర్ని నానీ, కొడాలి నాని విజయవాడ విషయంలో, కులం చిచ్చు రగిల్చే కుట్రకు తెర తీస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే చెప్పాలంటూ తెరపైకొచ్చిన నానీ జోడీ, చెరో కులరాగం ఎత్తుకున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే పేర్ని నానీ, విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వస్తే మెజారిటీ ప్రజల ఆమోదాన్నే పరిగణనలోకి తీసుకుంటామన్నారని అన్నారు. అంటే కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం మంత్రి నానీ చేశారని అంటున్నారు.
మరోవైపు మచిలీపట్నం కేంద్రంగా ప్రతిపాదించిన  కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని జిల్లా ప్రజలు పాదయాత్రలో సీఎం జగన్‌ను కోరారని మరో మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకే ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అదే సమయలో ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకూరు, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో ఉందని అన్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినట్లు కొడాలి నాని తెలిపారు. తమ వద్దకు వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంటే, రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే విజయవాడ విషయంలో చిచ్చు రగిల్చేందుకు ప్రభుత్వం, అధికార పార్టీ  ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి, వంగవీటిని తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని  సొంతం చేసుకునేందుకు వైసీపీ ఇప్పటికే ఒక విఫల యత్నం చేసింది. వంగవీటి రాధా హత్యకు రిక్కీ జరిగిన సందర్భంలో మంత్రి కొడాలి నానీ, ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరపున రాయబేరాలునడిపారు. అయితే, చంద్రాబాబు చాణక్యం మూడు నానీల పప్పులు ఉడకలేదు.అందుకేఇప్పుడు మళ్ళీ, విజయవాడ జిల్లా పేరును చుట్టూ కుల రాజకీయం   చేసేందుకు వైసేపీ కుట్ర చేస్తోందని అంటున్నారు.