సర్కారును నమ్మేదేలే.. చర్చలకు వచ్చేదేలే

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. అదొకటి అలా ఉంటే, అసలు ప్రభుత్వం చేతులు కాలిన తర్వాత అయినా ఆకులు పట్టుకుందా లేక ఇంకా ఏదైనా కొత్త ట్రిక్ ప్లే’ చేస్తోందా? అనే అనుమానాలు కూడా లేక పోలేదు. అవును, మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ‘పీఆర్సీ’ పంచాయతీ విషయంగా ఉద్యోగ సంఘాలతో ఆడుతున్న దాగుడు మూతల గురించే. 

అర్థరాత్రి జీఓలతో రాష్ట్ర ప్రభుత్వమే వివాదానికి శ్రీకారం చుట్టింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.నిజానికి, ఒక విధంగా చూస్తే, ప్రభుత్వం వ్యూహత్మకంగానే అడుగులు వేస్తోంది. ఉద్యోగులను, ఉద్యోగుల డిమాండ్లను సమర్ధిస్తున్న వారిని,ముఖ్యంగా ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను, పేదల పొట్టలు కొట్టే పాపులు చూపించి, రాజకీయ ప్రయోజనం పొందే కుట్రలు సాగిస్తూనే వుంది. అయితే, సర్కార్ ప్రయత్నాలు ఫలించలేదు. అంతే కాదు, ఉద్యోగులు  జీతాలు పెంచితే పధకాలు ఆగిపోతాయని  ప్రభుత్వం చేసిన ప్రచారం బూమ్రాంగ్ అయింది. ఉద్యోగ సంఘాలు మాకు కొత్త పీఆర్సీ వద్దు, కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ఇవ్వండని ఎదురు దాడికి దిగడంతో, ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడిపోయింది.అందుకే ఇప్పుడు చర్చలకు రండని ఉద్యోగ సంఘాల నాయకులకు సర్కార్ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సందేశాలు పంపుతున్నారు. చర్చలకు ఏర్పాటు చేసిన కమిటీ అన్ని వేళలల అందుబాటులో ఉంటుందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వచ్చినా చర్చిస్తామని తెలిపారు. అంటే, ఉద్యోగ సంఘాల మద్య చిచ్చు విభేదాలు సృష్టించేందుకు సజ్జల విత్తు నాటారు. అలాగే, బెదిరింపు బాణాన్ని సంధించారు.సమ్మె చట్ట విరుద్దమని సుప్రీం కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సమస్య ఎప్పటికైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇలాంటి మొండివైఖరి సమంజసం కాదన్నారు. వాళ్లు శత్రువులు కాదని.. మా ఉద్యోగులేని అన్నారు. పీఆర్సీ ఉద్యోగులకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఓ మెట్టు దిగేందుకు సిద్ధమన్నారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులే కాకుండా ఏ సంఘం వారు వచ్చినా చర్చలు జరుపుతామన్నారు.

అయితే, ఓ వంక చర్చలకు పిలుస్తూనే,ప్రభుత్వంకొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జీతాలు, పింఛన్ బిల్లుల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి సర్క్యులర్ జారీచేసింది.దీంతో, ప్రభుత్వం సలహాదారు చెప్పే మాటలు నమ్మేది లేదని, సమ్మెకు సిద్దమవుతున్నారు.కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తున్నాయి.. పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలంటున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ వ్యూహకర్త సలహాలు పాటిస్తున్నారో ఏమో కానీ, వ్యూహాత్మక ఉచ్చులోకి అడుగులు వేస్తున్నారని, అంటున్నారు. ఏమవుతుందో, వివాదంఎంతవరకు వెళుతుందో కానీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మద్యఅఘాదం ఏర్పడడం, అంట మంచిది కాదని, విజ్ఞులు సూచిస్తున్నారు.