బీజేపీకి కాంగ్రెస్ ఓటు బ్యాంకు? దుబ్బాకలో మరో ట్విస్ట్!

శత్రువుకు శత్రువు మిత్రుడవుతుంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం కోసం, తమ ప్రత్యర్థులను మట్టి కరిపించడం కోసం పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తుంటాయి. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతున్న దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇలాంటి సీనే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ ను ఓడించి సీఎం కేసీఆర్ కు షాకిచ్చేందుకు పార్టీలకతీతంగా విపక్ష కార్యకర్తలు ఏకమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత చీలి అధికార పార్టీకి ప్రయోజనం కల్గకుండా చూసేందుకే లోపాయికారిగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు తమ బద్దశత్రువైన పార్టీకి కూడా మద్దతు ఇచ్చేందుకు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారనే చర్చ దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోంది. 

 

దుబ్బాక ఉప ఎన్నికలో త్రిముఖ పోరు జరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలంతా దుబ్బాకలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా సీరియస్ గా ప్రచారం చేస్తుండటంతో ట్రయాంగిల్ వార్ ఉత్కంఠ రేపింది. అయితే ఇటీవల జరిగిన ఘటనలతో  సీన్ మారిపోయిందంటున్నారు. రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసుల సోదాలు, గులాబీ నేతల తీరుతో బీజేపీపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని చెబుతున్నారు. అధికార పార్టీ బోగస్ బ్యాలెట్ కు దిగిందనే ప్రచారం ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచిందంటున్నారు.దీంతో నియోజకవర్గంలోని కొందరు ఓటర్ల మైండ్ సెట్ లో మార్పు వచ్చిందంటున్నారు. 

 

ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు.. విపక్షాల్లో ఏదో ఒక పార్టీనే ఎంచుకుని ఓటేయాలని భావిస్తున్నారట. అలా అయితేనే అధికార పార్టీని ఓడించడం సాధ్యమవుతుందని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుందనే అభిప్రాయంతో ఉన్నారట. ఇప్పటికే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు  బీజేపీ గట్టి పోటి ఇస్తుందన్న ప్రచారం ఉంది. సో ఆ పార్టీకే సపోర్ట్ చేయాలని కేసీఆర్ సర్కార్ పై కోపంగా ఉన్న ఓటర్లు డిసైడయ్యారని చెబుతున్నారు. 

 

దుబ్బాకలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతున్నా ఆ పార్టీ కార్యకర్తల ఆలోచన మరోలా ఉందంటున్నారు. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారనే సమాచారం వస్తోంది. బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అయినా కేసీఆర్ కు షాకిచ్చేందుకు వారికి కూడా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ కేడర్ ఓపెన్ గానే చెబుతున్నారట. ప్రస్తుతానికి కొన్నిగ్రామాల్లో ఇలాంటి టాక్ వినిపిస్తున్నా క్రమంగా ఇది నియోజకవర్గమంతా విస్తరించే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్ రోజు నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయి టీఆర్ఎస్, బీజేపీ 
మధ్యే పోటీ జరిగినా అశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ కు అత్యంత కీలకం. దుబ్బాకలో బీజేపీ గెలిచినా, సెకండ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్తుకే ప్రమాదం. ఈ విషయం తెలిసే దుబ్బాక బైపోల్ ను పీసీసీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. అయితే లోకల్ కేడర్ అలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉందట. టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యంగా వారు చెబుతున్నారట. అందుకే తమ పార్టీ లీడర్లతో సంబంధం లేకుండానే బీజేపీతో హస్తం కార్యకర్తలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీ కన్నా వెనకబడితే కాంగ్రెస్ ఫ్యూచర్ ప్రమాదంలో పడుతుందని కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలకు చెప్పాలని చూసినా వారు కన్వీన్స్ కావడం లేదట. కేసీఆర్ ను ఓడించడమే తమకు ముఖ్యమని చెబుతున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక పీసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట.

 

టీఆర్ఎస్ ను ఓడించడం వరకు బాగానే ఉన్నా అందుకోసం తమకు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి సపోర్ట్ చేయడమే తమకు ఇబ్బందిగా ఉందని పీసీసీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గ జనాల్లో వస్తున్న మార్పు తమకు కలిసి వస్తుందని కమలనాధులు ఆశ పడుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో తమకు విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లితే తమకు కష్టేమేనన్న అభిప్రాయం కారు పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu