అధిష్టానం ఆశలన్నీ తెలంగాణ పైనే!
posted on Jul 7, 2025 10:52AM

తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. సామాజిక న్యాయ సదస్సు పేరిట జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేశారు. అలాగే.. పార్టీలో అసమ్మతి మొదలు పదవుల భర్తీ వరకు అనేక విషయాలను సమీక్షించి రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు.ఈ మొత్తం కసరత్తును చూస్తే.. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు.
అలాగే, ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోందో కూడా వేరే చెప్పనవసరం లేదంటున్నారు. ఆ విషయం కూడా కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను రోల్ మోడల్ గా భావిస్తోందని స్పష్టంగానే చెప్పారు. నిజానికి ఇప్పుడు వేణుగోపాల్ చెప్పడం కాదు.. ఎప్పుడోనే పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ కులగణన విషయంగా తెలంగాణ మోడల్ ది బెస్ట్ అని ప్రకటించారు. అంతే కాకుండా.. జాతీయ స్థాయిలో జనగణనతో పాటుగా చేపట్టే కులగణనకు తెలంగాణ మోడల్ ఫాలో కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే.. తాజాగా సామాజిక న్యాయ సదస్సు వేదిక నుంచి చేసిన ప్రసంగంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా కులగణన చేయించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబు నిచ్చారు. అంతే కాదు.. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందనీ, ఈ పోరాటంలో రాష్ట్ర ప్రజలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. సో...కాంగ్రెస్ అధిష్టానం కులగణనకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో.. తెలంగాణ స్థానిక ఎన్నికలకూ అంతే ప్రాధన్యత ఇస్తోందని, అంత సీరియస్ గా తీసుకుంటోందని అంటున్నారు.
అందుకే.. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోందని అంటున్నారు. అయితే, నిర్ణయం కేంద్రం కోర్టులో ఉన్నదున.. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.అయినా.. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు న్యాయనిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. ఒక్క బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ వాగ్దానంతోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? లేక అమలు కాని హామీలు, గ్యారెంటీలు, రైతులు, నిరుద్యోగ యువకులు, మహిళలు ఇలా విభిన్న వర్గాల ప్రజల్లో క్షణ క్షణం పెరుగుతున్న అసంతృప్తి, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి ప్రతికూల అంశాలు కూడా స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం హోప్స్ అన్నీ తెలంగాణ పైనే పెట్టుకుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.