కాంగ్రెస్ లో మరో చీలిక ? ఆజాద్ సారథ్యంలో జీ23 లీడర్లు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు మరో మారు భగ్గుమన్నాయి. గతంలో జీ 23గా ప్రాచుర్యం  పొందిన 23 మంది సీనియర్ నాయకులు మళ్లీ గళం విప్పారు. పార్టీ అధినాయకత్వంపై నేరుగా అసమ్మతి అస్త్రాలను సందించారు. కాంగ్రెస్ సమూలంగా పక్షాలన చేయాలని కోరుతూ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి గతంలోనే లేఖ రాసిన జీ 23 నాయకులు.. ఈసారి జమ్మూలో సమావేశమయ్యారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ శాంతి సమ్మేళనం పేరుతో నిర్వహించిన గులాంనబీ ఆజాద్ సన్మాన కార్యక్రమం వేదిక నుంచి అసమ్మతి గళాన్ని గట్టిగ పినిపించారు. 

 కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి  రెండు విషయాలను స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. అందులో మొదటిది నిజమైన గాంధేయ వాదానికి తామే నిజమైన వారసులమని స్పష్టం 
చేయడం. పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అనుభవాన్ని, సేవలను పార్టీ  గుర్తించలేదన్న అభియోగం రెండవది. ఇటీవల రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత గులాం నబీ ఆజాద్ కు మరో అవకాశం ఇవ్వకపోవడాన్ని అసమ్మతి నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. ఆవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఆజాద్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

గాంధీయ సిద్ధాంతాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్న నేతలు, జీ 23కి కొత్త అర్ధాన్ని ఇచ్చారు. సమావేశంలో ప్రసంగించిన ఉత్తర ప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్ బబ్బర్, “ అందరూ జీ 23 అంటున్నారు, కానీ నేను, గాంధీ 23 అంటాను.గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని జీ 23 కోరుకుంటోంది” అంటూ గాంధీ ఆశయాలకు తామే నిజమైన వారసులం అని చెప్పకనే చెప్పారు.ప్రస్తుత నాయకత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు ఇచ్చారు. 

పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ..  మనం ఇక్కడ వాస్తవాలే మాట్లాడుకుందాం అంటూ “కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బహీనమవుతోంది.ఇదివాస్తవం.కాంగ్రెస్ పార్టీ బలహీనమైతే దేశం బలహీన మవుతుంది.ఇది నిజం. దేశాన్ని బలోపేతం చేసేందుకు  పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం వుంది.పార్టీని బలోపేతం చేసేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పారు.  పార్లమెంట్ నుంచి ఆజాద్ కు ముక్తి లభించినప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పారు. ఆజాద్ సేవలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు సిబాల్. 
ఆజాద్ కు మరో మారు అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వం జీ23 నాయకులను పక్కన పెట్టేందుకు సిద్దమైందని నాయకులూ అర్థమైంది. అందుకే  అంతిమ పోరుకు. అవసరం అయితే  పార్టీని చీల్చేందుకు కూడా జీ23 సిద్డమన్న సంకేతలు ఇచ్చారు. ఆజాద్ నాయకత్వంలో, గాంధీ సిద్ధాంతాలు ఆధారంగా కొత్త పార్టీ ఏర్పాటుకు కూడా సిద్డమన్న సంకేతాలు ఇచ్చారన్న మాట కూడా వినవస్తోంది. 

మరో వంక ఆనంద శర్మ పార్టీ అధినాయకత్వంపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సహా ఎవరి పేరూ ప్రస్తావించకుండానే  “పార్టీ ఎవరికైనా ఏ పదవిని అయినా ఇవ్వవచ్చును, కానీ, పదవిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రజానాయకుడు కాలేరు” అని ఘాటుగా చురకలు అంటించారు. 
అన్నిటికంటే ముఖ్యంగా చివర్లో ప్రసంగించిన ఆజాద్.. తాను “ రాజ్య సభ నుంచి రిటైర్’ అయినా రాజకీయాల నుంచి రిటైర్ కాలేద” ని అన్నారు. అందుకే  జమ్మూ నుంచి ఆజాద్ శంఖారావం పూరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 ఆజాద్ ను  పార్టీ విస్మరించిందన్న  జీ 23 నేతల అభియోగాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తిప్పి కొట్టారు.ఆయనకు పార్టీ అన్ని అవకాశాలను కలిపించిందని అన్నారు. ఇందిరా గాంధీ సమయంలోనే ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిపించిన విషయాన్నిగుర్తు చేశారు. ఆజాద్ సుమారు 40 ఏళ్ళపాటు పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యునిగా ఉన్న విషయాన్నీ సింఘ్వీ గుర్తు చేశారు. జీ 23 నేతలు తమ విధేయతను చాటుకునేందుకు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీని గెలిపించాలని సూచించారు. ఈ పరిణామాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరో చీలిక అనివార్యంగా కనిపిస్తోందా అంటే.. కాదనలేమని అంటున్నారు విశ్లేషకులు.