బిజెపీ తో జ‌గ‌న్ దోస్తానా పై కాంగ్రెస్ మండిపాటు

మంచిప‌ని చేసిన‌వారు ఏ స్థాయిలో వున్న గౌర‌వం అందుకుంటారు. అంద‌రూ అభిమానిస్తారు.  అంత‌గా ప‌రిచ‌యం లేకున్నా వూహించ‌కుండా స‌హాయ‌స‌హ‌కారాలు అందించేవారిని అభిమానిస్తారు. కానీ తెలిసి ద్రోహం చేస్తున్న‌వారి ప‌ట్ల వీరాభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం, అడుగుల‌కు మ‌డ‌గులు ఒత్త‌డం కేవ‌లం జ‌గ‌న్ తోనే సాధ్యం. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వారికి జ‌గ‌న్ ప‌ట్ల కోపం కట్ట‌లు తెంచుకుంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపీకి జ‌గ‌న్ మ‌ద్ద‌తునివ్వ‌డంపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు శైల‌జానాధ్ మండిప‌డు తున్నారు. 

రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌టి  నుంచి కేంద్రం  చేసిన సాయం ఏమీ లేద‌ని, కేంద్రం మాయ‌మాట‌ల్లో ప‌డి ముఖ్య మంత్రి జ‌గ‌న్ రెడ్డి కేంద్రాన్ని వేనోళ్ల ప్ర‌శంసిస్తుండ‌టం, ఢిల్లీ యాత్ర‌ల్లో ప్ర‌ధాని మోదీని, ఇత‌రు లను క‌లిసి ఫోటోలు తీయించుకోవ‌డం త‌ప్ప రాష్ట్రం గురించి గ‌ట్టిగా ఎన్న‌డూ  అడిగిన పాపాన పోలేద‌ని రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి ఉంచి ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రంతో ఏనాడూ గ‌ట్టిగా విభేదించ‌క‌పోవ‌డం, ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం  కేంద్రంప‌ట్ల భ‌క్తి ప్ర‌ప‌త్తులు  రోజు రోజుకీ పెర‌గ‌డ‌మే తెలియ జేస్తోంది. వీరికి వారు వారికి వీరు అన్న‌ట్టుగా కేంద్రంకూడా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. ఇక్క‌డి నాయ‌కులు పైకి తిడుతూ, త‌మ మ‌ధ్య ఎలాంటి గొప్ప స్నేహ‌మేమీ లేద‌ని ప్ర‌చారం చేస్తున్న‌ప్ప టికీ కేంద్రం నుంచీ అలాంటి సంకేతాలైతే ఏమీ లేవు. ప‌క్క‌నే వున్న తెలంగాణా పై కేంద్రం విరుచుకు ప‌డుతున్నంత‌గా ఆంధ్రా ప‌ట్ల విముఖ‌తేమీ క‌న‌ప‌ర‌చ‌డం లేదు. కేంద్రం హామీల‌ను నెర‌వేర్చ‌డం కంటే జ‌గ‌న్‌తో భ‌జ‌న చేయించుకోవ‌డంలోనే ఎక్కువ ఆనందిస్తున్నార‌న్న అనుమానాలే ప్ర‌చారంలో వున్నాయి. కేంద్రంతో జోడీ క‌ట్టి రాష్ట్రానికి ఏమి ఒర‌గ‌బెట్ట‌న‌పుడు ఆ స్నేహం విలువేమిటి అన్న‌ది విప‌క్షాల  ప్ర‌శ్న‌. 

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల‌ను  అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్  గురువారం చేప‌ట్టిన ధ‌ర్నాలో శైల‌జానాద్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వోటు  వేయాల ని డిమాండ్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హామీలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హామీ లపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రానికి హోదా విభజన హామీలను అమలు చేసే వరకు  కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ అన్నారు.