త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఏపీ నుంచి ఒకరికి ఛాన్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారా? అలాంటి అవసరం,  అవకాశం ఉన్నాయా? అంటే, ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతున్నట్లు  తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్’ రాజీనామా చేసిన నేపధ్యంలో, ఆ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడంతో పాటుగా,రానున్న రోజులలో జరగనున్న గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్ర  శాసన సభ ఎన్నికలు, అదే విధంగా, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని రాజకీయ. మీడియా వర్గాల్లో గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీకి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, జేడీ (యు)కు చెందిన ఆర్సీపీ సింగ్ తమ రాజ్యసభ సభ్యత్వ గడవు  గురువారంతో  ముగుస్తునందున, మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ చర్చ మరో మారు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. 

అయితే, మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికిప్పుడు ఉండే అవకాశం అయితే లేదని, జూలై 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు,  రాష్టపతి, ఉప రాష్టపతి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగష్టు రెండవ వారం తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని విస్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే, ఇద్దరు మంత్రుల రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, నఖ్వీ స్థానంలో ఆయన నిరహిస్తున్న మైనారిటీ సంక్షేం శాఖను, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి, ఆర్పీ  సింగ్ నిర్వహించిన ఉక్కు శాఖ బాధ్యతలను, జ్యోతిరాదిత్య  సింధియా అదనపు బాధ్యతలుగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

కాగా, నఖ్వీ రాజీనామాతో, కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేని పరిస్థితి, బహుశా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే, సుమారు 400 మంది వరకు ఉన్న బీజేపీ ఉభయ సభల ఎంపీలలోనూ ఒక్క ముస్లిం కూడా లేరు. అయితే, నఖ్వీని ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలిపే అవకాశం ఉందని అంటున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగష్టు 6న జారుతుంది.   గురువారం(జూలై 7)తో  నఖ్వీ రాజ్య సభ సభ్యత్వ పదవీ కాలం ముగుస్తున్నందున ఒకటి రెండు రోజుల్లో, బీజీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో   ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా నఖ్వీ పేరును ప్రకటించవచ్చని అంటున్నారు. నఖ్వీ రాజీనామాకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డను కలవడంతో , ఆయనే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి అనే ఉహగానాలకు మరింత బలం చేకూరింది. 

అదలా ఉంటే, రాష్టపతి కోటా రాజ్యసభ సభ్యులుగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన  నలుగురికి అవకాశం  కలిపించడంతో, బీజేపీ దక్షణాది రాష్ట్రాలపై గట్టిగా దృష్టి పెట్టిందని, మరోమారు  స్పష్టం అయ్యిందని అంటున్నారు. సో .. మంత్రి విస్తరణలోనూ దక్షణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి,జీవీఎల్ నరసింహారావుకు అవకాశం ఉంటుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అలోచన కూడా ఉందని అంటున్నారు. అలాగే, మెగా స్టార్ చిరజీవి పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు.

తెలంగాణ నుంచి లక్ష్మణ్ తో పాటుగా, త్వరలో బీజేపీలో చేరనున్న మరో కీలక నేత పేరు కూడా పరిశీలనలో ఉండవచ్చని అంటున్నారు. అయితే,  మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంతవరకు అధికారకంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ,  నాలుగు రోజులు అటూ ఇటుగా అయినా కేంద్ర  మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా ఉంటుందని  రాజకీయ పండితులు జోస్యం చెపుతున్నారు.