వైకాపాకు విరుగుడు మంత్రం వేసిన కాంగ్రెస్

 

కాంగ్రెస్ పార్టీపై వైకాపా సంధించిన సమైక్యాస్త్రాన్నిఎదుర్కొనేందుకు ఒక బ్రహ్మాస్త్రమే సిద్దంగా ఉంచుకొంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినడిగి రాష్ట్ర విభజన చేసిందని ప్రశ్నిస్తూ ఉద్యమంలోకి దూకిన వైకాపాకు, గతంలో తెలంగాణా కోరుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖను ఇప్పుడు బయటపెట్టింది. 2004లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తెలంగాణ కోరుతూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి ఆయన సంతకం చేసి పంపిన లేఖను కాంగ్రెస్ ఇప్పుడు బయట పెట్టింది. దీనితో వైకాపా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనేందుకు మరో కొత్త అస్త్రం చూసుకోక తప్పదు. అయితే, అది తన శాసనసభ్యుల రాజీనామాలతో రాజేసిన సమైక్యమంటలు నేడు రాష్ట్రమంతా వ్యాపించడమే కాకుండా ఇతర పార్టీలని కూడా దహించివేస్తున్నాయి.

 

అయితే, ఈ నిరసనలను, ఆందోళనలను కాంగ్రెస్ ఎంత మాత్రం పట్టించుకొనే ఆలోచన లేదని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం తీసుకొన్నపుడు ఇటువంటి ప్రతిస్పందన చాల సహజమేనని ఆయన చెప్పడం పార్టీ కూడా ఈవిషయమై పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలియజేస్తోంది.

 

మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడితే, దానిని అదిగమించేందుకు కూడా కాంగ్రెస్ మరో అస్త్రం సిద్దంగా ఉంచుకొంది. రాష్ట్ర విభజనపై శాసనసభ ఆమోదించడం సంప్రదాయమే అయినప్పటికీ, అది తప్పని సరి కాదని కాంగ్రెస్ ముందే ప్రకటించింది. అందువల్ల అది 2009 ఫిబ్రవరి 12న రాజశేఖర్ రెడ్డి అద్వర్యంలో రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై జరిగిన చర్చను, నాటి సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాన్నిప్రాతిపదికగా తీసుకొని నేడు ముందుకుపోయేందుకు సిద్దపడుతోంది. అందువల్ల రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యుల రాజీనామాలతో రాజ్యంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, అది రాష్ట్ర విభజన ప్రక్రియకు అవరోధం కాబోదు. అది కేవలం రాష్ట్రపతి పాలనకు మాత్రమే దారి తీస్తుంది.

 

ప్రస్తుతం తెలంగాణా ప్రక్రియ కొనసాగించడంకంటే పార్టీకి చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యులు, యంయల్సీలు చేస్తున్న రాజీనామాలను తట్టుకొని నిలబడటమే కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష. ఈ పరీక్షలో పార్టీ ఎంత త్వరగా విజయం సాధిస్తే అంత మంచిది.