ఓటమి భయంతో ఈసీని ఆశ్రయించిన ఓవైసీ 

హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల కమిషన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల కమిషన్ కు  బిజెపి మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద  మోడీ, అమిత్ షాలు దృష్టి పెట్టారని వీరిద్దరిని ఓడించాలంటే బిజెపి అభ్యర్థి మాధవిలతకు డిపాజిట్లు రాకుండా చేయాలని ఓవైసీ పిలుపునిస్తున్నారు. ప్రతీ బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 40 ఏళ్ల పాటు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం ఏక చత్రాధిపత్యం వహిస్తున్నప్పటికీ మునుపెన్నడూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించలేదు. ఎంఐఎం చరిత్రలో మొదటి సారి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి బిజెపి మీద ఫిర్యాదు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.  బోగస్ వోట్లతో మజ్లిస్ గెలుస్తూ వస్తుందని ఇప్పటికే మాధవిలత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ సారి కొంత శాతం బోగస్ వోట్లు తగ్గిపోయే సూచనలు కనిపించడంతో అసదుద్దీన్ ఓవైసీ కి ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఓవైసీ సూచన మేరకు డమ్మీ అభ్యర్థిని నిలబెడుతారని ప్రచారంలో ఉంది. తెలంగాణలో కేవలం హైదరాబాద్ లోని పోలింగ్ బూత్ ల పైనే ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సిటీలోని 420 పోలింగ్ బూత్ లలోనే తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ లపై నిఘా పెట్టాలని సూచించారు.హైదరాబాద్ పై మాత్రమే స్పెషల్ ఫోకస్ ఎందుకని నిలదీస్తూ.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాతబస్తీలో ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.