సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వారసత్వం కోసం కాంగ్రెస్, మోడీల యుద్ధం

 

దేవుళ్ళనే వదిలిపెట్టని మన రాజకీయ నాయకులు, వారి పార్టీలు ఇక దేశ సౌభాగ్యం కోసం కృషి చేసిన మహనీయులను మాత్రం విడిచిపెడతారని ఆశించడం అడియాస, అవివేకమే అవుతుంది. బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ, దేశాన్నిసమైక్య పరిచిన ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వారసుడిగా, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రతిరూపంగా తనను తాను ప్రజల ముందు అవిష్కరించుకోనేందుకు చాలా కష్టపడుతున్నారు.

 

ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న అహ్మదాబాద్ లో సర్దార్ మ్యూజియం ప్రారంభించారు. త్వరలో అంటే బహుశః రానున్నఎన్నికలలోగా దేశంలోకెల్లా అతి పెద్దదయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం గుజరాత్ లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే అంత మాత్రన్న ప్రజలు మోడీని ఆ మహానుభావుడి వారసుడిగా అంగీకరిస్తారనే నమ్మకం లేదు. ఎవరు అంగీకరించినా , అంగీకరించక పోయినా కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు.

 

మొన్న మ్యూజియం ప్రారంభోత్సవానికి హాజరయిన ప్రధాని డా.మన్మోహన్ సింగ్, మోడీల మధ్యన జరిగిన మాటల యుద్దమే అందుకో మంచి ఉదాహరణ. సభలో మొదట ప్రసంగించిన మోడీ, “మన దేశ మొట్ట మొదటి ప్రధానిగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఉండి ఉంటే నేడు దేశపరిస్థితి ఇలా కాక వేరేలా ఉండేదని, కానీ దురద్రుష్టవశాత్తు అలా జరుగలేదని, అయినప్పటికీ ఆయన హోంమంత్రిగా దేశాన్ని సమైక్యపరిచి బలోపేతం చేసారని మెచ్చుకొన్నారు.

 

తద్వారా దేశ మొట్ట మొదటి ప్రధాని నెహ్రుని ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలోనే విమర్శించడమే కాకుండా, నెహ్రు కారణంగానే భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయిందని ఆరోపణలు చేసినట్లయింది. అంతే గాక నాటి నుండి నేటి వరకు కూడా నెహ్రు కుటుంబం వంశవార పాలన దేశ ప్రజలు మీద బలవంతంగా రుద్దుతున్నారని మోడీ ఇప్పటికే చాలా సార్లు అన్నారు కూడా.

 

అయితే చాలా సౌమ్యుడిగా పేరున్న ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మోడీకి అంతే ఘాటుగా సమాధానం చెప్పడం విశేషం. “వల్లభ్ భాయ్ పటేల్ గొప్ప లౌకిక వాది, గనుకనే ఆయన కాంగ్రెస్ పార్టీతోనే కలిసిసాగారు. అటువంటి మహనీయుడి పనిచేసిన పార్టీలో నేనూ సభ్యుడిగా ఉండటం గర్వంగా భావిస్తున్నాను. దేశ సమగ్రతను ఆయన బలంగా కాంక్షించారు. నెహ్రుజీ, పటేల్ విభిన్నమయిన దృక్పదాలు కలిగిన వ్యక్తులయినప్పటికీ వారిరువు కూడా దేశ ప్రజలందరినీ తమ స్వంత సోదరులు, స్నేహితులుగా భావించేవారు. అందుకే వారు అజరామరమయిన కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు,” అని మోడీకి చురకలు వేసారు.