మోడీ నెత్తిన పాలు పోసిన కాంగ్రెస్: ఇండియా కూటమిలో విభేదాలు రాహుల్ పుణ్యమేనా.?
Published on: Sat Nov 28, 2026 1:50PM

కాంగ్రెస్ తనంత తానుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కు ప్రయోజనం చేకూర్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మోడీ సర్కార్ కు ఆయాచిత వరంగా పరిణమించింది. తమిళనాడు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అనూహ్య లబ్ధిని చేకూర్చిపెట్టింది. ఆ నిర్ణయమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం, బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బదనాం చేసింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకడం ద్వారా దశాబ్దాలుగా తోడుగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ చేజేతులా దూరం చేసుకుంది. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. అంతే కాకుండా ఇండియా కూటమిని బలహీన పరిచి.. కాంగ్రెస్ కు ఇసుమంతైనా రుచించని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు దోహదం చేస్తున్నది.
గత ఏప్రిల్‌లో పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేక డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన మోదీ-షా ద్వయం.. అదును చూసి పార్లమెుంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ బిల్లుకు ఆమోదం పొందేందుకు పక్కాగా వ్యూహరచన చేసింది. ఈ బిల్లు ఆమోదంలో ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులున్న డీఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి వెన్నెముకగా నిలిచిన డీఎంకే.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వచ్చింది.
ఇప్పుడు 22 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉందన్న వార్తలు, గతంలో టీవీకేకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృసంగా మారిందన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ అగ్రనాయకత్వం, డీఎంకే ప్రధాన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేసి వారి మద్దతు సాధించింది. తమిళనాడు సహా ఏ రాష్ట్రంలోనూ సీట్ల నిష్పత్తి తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడం ద్వారా డీఎంకే మద్దతు సాధించడమే కాకుండా, కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయగలిగింది.

దీనికి తోడు, పాతికేళ్ల రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య వాటాను స్థిరంగా కొనసాగించాలన్న డీఎంకే మరో ప్రధాన షరతుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపడం, అలాగే ఎన్సీపీ( శరద్ పవార్ )వర్గంతోనూ సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టడంలో మోడీ షా ద్వయం సక్సెసయ్యింది. ఈ విధంగా టీవీకేకు తమిళనాడులో మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ ఇండియా కూటమికి రెండు కీలక రాజకీయపార్టీలు దూరం కావడానికి కారణమైంది.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు
ఇప్పుడు డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మద్దతుతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి ఎన్డీయే చేరువ అయ్యింది. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. మహిళా రిజర్వేషన్ల అమలు క్రెడిట్‌ను, మరోవైపు డీలిమిటేషన్ ఘనతను మోడీషా ద్వయం తమ ఖాతాలో వేసుకునే అవకాశం దక్కించుకుంది. అదే సమయంలో కూటమి విభేదాలు జాతీయ స్థాయిలో రచ్చకెక్కేలా చేయగలిగింది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!
[Congress, StratagicFailur, Tamilnadu, TVK Support, Delimitation, Cut, DMK, INDIA Alliance, TeluguOne]


