రెండు వేల కోట్లిస్తే రాజీనామా! కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం..

ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు హుజురాబాద్ అత్యంత కీలకమని భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు హుజురాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నాయి. ఈటలకు చెక్ పెట్టడంతో పాటు హుజురాబాద్ గెలిచి రాష్ట్రంలో బలంగా ఉన్నామని చాటేలా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న రేషన్ కార్డులను పంపిణి చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని మొదలు పెట్టారు. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే 12 వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దీంతో ఉప ఎన్నిక కారణంగా హుజురాబాద్ నియోజకవర్గం దశ మారుతుందనే చర్చ జరుగుతోంది.

హుజురాబాద్ లో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉప ఎన్నిక కోసం వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసమే తాయిలాలు ప్రకటిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలు ఉన్నందుకు హుజురాబాద్‌లో వేల కోట్ల డబ్బును ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మునుగోడు నియోజక అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఇస్తానంటే.. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మునుగోడు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడం లేదని.. కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు నిధులు ఇస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న దళిత బంధు పథకంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హుజూరాబాద్‌లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో 100 కుటుంబాలకే సాయం చేస్తామనడం సబబేనా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీరుతో తమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే బాగుండని జనాలు కోరకుంటున్నారని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎమ్మెల్యేలపై దాడులు జరిగే పరిస్థితి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.