రోడ్డు తవ్వి కంకర దొంగతనం.. అమరావతిలో ఘోరం? ఇదెవరి పన్నాగం? 

ఒక బిల్డింగ్ కడుతు కడుతూ మధ్యలో వదిలేస్తే... అలాగే ఉంచేస్తే ఏమవుతుంది? నెమ్మదిగా దానికి ఎవరూ లేకుండా పోతారు. ఎవరో ఒక వాచ్ మెన్ నామ్ కే వాస్తే ఉంటాడంతే.. ఎవడిదైనా కన్ను పడిందంటే చాలు మెల్లగా అందులో కుదిరినవన్నీ ఎత్తుకుపోతుంటాడు.. కావాలంటే వాచ్ మెన్ కి కమీషన్ ఇస్తారు. లేదంటే కొడతారు. ఇప్పుడు అమరావతి పరిస్ధితి అలాగే ఉంది. అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాల్సిన ప్రాంతం నేడు శిథిలమైన భవనంలా మారింది. దీనికీ వాచ్ మెన్ ఉన్నాడు.. కాని ఆ వాచ్ మెన్ స్వయంగా దానిని నాశనం చేయాలనుకుంటున్నాడు.. దొంగలు పడి ఎత్తుకుపోతుంటే... ఆ దొంగలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాడు. దొంగలను అతడే పంపాడా..లేక అతడి మనుషులే దొంగలా అనేది అతనికే తెలియాలి. అమరావతిలో రోడ్డు తవ్వి కంకర ఎత్తుకుపోయారంటే.. ఎత్తుకుపోయినా ఎవరూపట్టించుకోలేదదంటే..ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి.

అమరావతిలో ఈ విచిత్రం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికే అమరావతిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లంతా మెటీరియల్ ను రోడ్డు మీదే వేసుకుంటారు కాబట్టి అదే పని చేశారు. ఇసుక, కంకర, స్టీల్ అన్నీ సైట్ల పక్కనే ఉన్నాయి. సడెన్ గా జగన్ ఆ నిర్మాణాలకు పేమెంట్స్ నిలిపేశారు.. మళ్లీ చేస్తారో చేయరో చెప్పలేదు. దీంతో లేబర్ అంతా వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు కూడా వేరే పనులు చూసుకున్నారు. అమరావతిలో ఇక నిర్మాణాలు జరగవని కొందరికే తెలుసు అప్పటికి.. వారంతా రోడ్డుపైన ఉన్న ఇసుక, కంకర, స్టీల్ ఎత్తుకుపోవడం మొదలెట్టారు. కొందరు కాంట్రాక్టర్లు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు వేగంగానే స్పందించారు.. కాని చేస్తున్నదెవరో తెలిశాక.. చేతులెత్తేశారు.

ఇప్పుడు ఏకంగా వేసిన రోడ్డును తవ్వి మరీ కంకర ఎత్తుకుపోయారు. ఉద్ధండరాయునిపాలెం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా వేస్తున్న రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. కంకర కూడా వేసినా..ఫైనల్ లేయింగ్ పని చేయకముందే ఆ పని ఆపేయడంతో కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. వాళ్ల బిల్లు కూడా ఇప్పటివరకు క్లియర్ కాలేదు. సైట్ల పక్కన పడి ఉన్నవి ఎత్తుకుపోయిన గ్యాంగ్ కళ్లు ఇప్పుడు ఈ రోడ్ల మీద పడ్డాయి. ఒకటిన్నర అడుగు వరకు ..దాదాపు 30 మీటర్ల మేర తవ్వుకుని లోడ్ చేసుకున్నారు. ఇంతలో అమరావతి దళిత జేఏసీ నాయకులకు ఎవరో చెప్పడంతో.. వారు పరుగులు పెట్టి అక్కడికి వెళ్లేసరికి ఆ గ్యాంగ్ కంకర లోడుతో సహా పారిపోయింది. 

వాళ్ళు ఎత్తుకుపోవడం విచిత్రం కాదు. అమరావతి కూడా ఏపీలో భాగమేనని.. పరిపాలనలో అది కూడా చూసుకోవాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉండటమే ఆశ్చర్యం. అక్కడికి పోలీసులు కేవలం అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులను ఆపటానికో, కొట్టడానికో.. అరెస్టు చేయడానికో తప్ప.. వేరే ఏ పని మీద అడుగు పెట్టరు. వైసీపీ వారు చేసే అక్రమాలపై ఫిర్యాదులు వస్తే అసలే పట్టించుకోరు. అందుకే అలా యధేచ్ఛగా రోడ్డు కూడా తవ్వుకుని తీసుకుపోయారు వారు. ఈ పాపాలన్నీ ఎప్పటికి పండుతాయో.. ఎప్పటికి వీటికి ఎండ్ కార్డు పడుతుందోనని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు.