జాతకాలు చెపుతున్న కామ్రేడ్లు

 

రాష్ట్రంలో మిగిలిన మరే రాజకీయ పార్టీలకన్నాకూడా ఎక్కువగా ప్రజలతో మమేకమవుతూ, వారి పక్షాన్న నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటాలుచేసే కమ్యునిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు రెండూకూడా దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్రంలో స్వయంగా గానీ, సంకీర్ణంగా గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి.

 

ఎన్ని పోరాటాలుచేసినా ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు తోకపార్టీలుగానే మిగిలిపోయాయి. అందుకు ఆపార్టీల రాష్ట్రనాయకత్వంలో లోపమా, లేక తమ పార్టీసిద్దాంతాలపట్ల ప్రజలలో నమ్మకం కల్గించలేకపోవడంవల్ల విఫలమవుతున్నారా? లేక ప్రదాన రాజకీయపార్టీల ప్రభావం ప్రజలమీద ఎక్కువగా ఉన్నందునే వెనుకబడిపోయారా? కారణాలు వారే తెలుపాలి.

 

రెండు పార్టీలుకూడా తాము జీవితాంతము ప్రధానరాజకీయ పార్టీలకు తోకపార్టీలుగానే ఉండిపోయేందుకు మానసికంగా సంసిద్దమయిపోయినట్లే కనిపిస్తోంది. విచారించవలసిన విషయం ఏమిటంటే, అలాగ మిగిలిపోయినందుకు ఆ రెండు పార్టీలు ఏనాడు చింతిస్తున్నట్లు గానీ, సిగ్గు పడుతున్నట్లు గానీ కనిపించకపోవడం. ప్రస్తుత అవి ఉన్న స్థాయిలోనే ఎన్నటికీ ఉండిపోవాలనుకొంటున్నాయే తప్ప, ఎందుకు ఇలాగ ఉండిపోయాము? ఎంతకాలం ఈవిదంగా ఉండిపోవాలి మనము? అని ఆలోచనలుచేసి, కొత్తగా చేసిన ప్రయత్నం ఏది లేదు.

 

ఒక సారి చేతులు కలుపుకొంటూ, మరోసారి తమ కొడవళ్ళు ఒకరిపై ఒకరు దూసుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి ఆ రెండు పార్టీలుకూడా.

 

ఇక విషయానికి వస్తే, మార్క్సిస్టు పార్టీ నాయకుడు బీవి రాఘవులు, తమ మిత్రపార్టీ సి.పి.ఐ. నాయకుడు నారాయణ తెలంగాణాపై నిత్యం చేస్తున్న ఊహాగానాలను గమనించి, ఆయననుద్దేశించి మాట్లాడుతూ కమ్యునిస్ట్ పార్టీ తమ ఆఫీసులో జాతకాలు చెప్పుకొనే దుకాణం కూడా తెరుచుకొంటే బాగుంటుంది అని చురకలు వేసారు. అయితే, దానిని సరదాగా తీసుకొన్న సి.పి.ఐ. నాయకుడు నారాయణ వెంటనే స్పందిస్తూ, “కమ్యునిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు రెండూ కూడా భవిష్యత్ సమాజం కోసం చేసిన ఆలోచనలోంచి పుట్టుకు వచ్చినవే. అందుకే రెండుకూడా ఎవరి జాతకం ఎలా ఉంటుందో చెపుతుంటాయి” అని జవాబిచ్చేరు.

 

గానీ కామ్రేడ్లు ఇద్దరూ ఎంతసేపు కూడా ఎదుటవారి ‘సైకిళ్ళు,’ ‘కార్లు’ ఎక్కుతూ వారి ‘హస్తరేఖల్లోనే’ తమ జాతకాలు చూసుకొవడం ఒక వింత.