త్వరలో జగన్ కి బెయిలు మంజూరు అవబోతోందా?

 

గత ఏడు నెలలుగా వివిధ కేసులలో చంచల్ గూడా జైలులో నిర్బంధించబడ్డ జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా కోర్టులో బెయిలు దరఖాస్తులు వేస్తూనే ఉన్నాడు. కోర్టులు వాటినన్నిటినీ కూడా తిరస్కరించినప్పటికీ, తనకి అన్యాయం జరుగుతోందనే సంగతిని మాత్రం కోర్టువారికి తెలియజేయగలిగేడు. ఇన్ని నెలలు జైలులో నిర్బందించినప్పటికీ, ఇంతవరకు కోర్టులు ఒక్క కేసులో కూడా విచారణ మొదలుపెట్టేందుకు, సిబి.ఐ. తగిన సమాచారంతో ముందుకు రాలేకపోయిందని, ఇంకా ఇప్పటికీ సమయం కోరుతోందని కోర్టువారికి జగన్ తరపున లాయర్లు విన్నవించుకోవడంతో, హైకోర్టు కూడా వారి వాదనలతో అంగీకరించి, జగన్ కేసుల విషయంలో సి.బి.ఐ. తన దర్యాప్తు ఎంతవరకు పురోగతి సాదించిందో తెలుపమని రిపోర్ట్ కోరింది. సిబిఐ తన రిపోర్టులను హైకోర్టుకి సమర్పిస్తూ, వివిధ కేసులకు సంబంధించి వివరాల కోసం తాము సచివాలయానికి వ్రాసిన లేఖలకి స్పందన కరువయిందని తెలుపుతూ, ప్రభుత్వం నుండి పూర్తీ సమాచారం పొందేందుకు మరో మూడు నెలలయినా పట్టవచ్చునని, అంతవరకూ జగన్ కు బెయిలు ఈయవద్దని కోర్టును కోరింది. అయితే, ఇప్పటికే ఏడూ నెలలు ఎటువంటి విచారణ లేకుండా జగన్ మోహన్ రెడ్డిని నిర్బందించడం అన్యాయం అని వాదిస్తున్న అతని లాయర్స్ వాదనతో కోర్టు గనుక అంగీకరిస్తే త్వరలో జగన్మోహన్ రెడ్డికి కోర్టు బెయిలు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. గానీ, కోర్టు, సిబిఐ వాదనతో అంగీకరించినట్లయితే మాత్రం జగన్ కి మరో మూడు నెలలు చెంచల్ గూడా నివాసం తప్పకపోవచ్చును.