సీఎం రేవంత్ గౌడ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

 

సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ గౌడ్ అని సంభోధించారు. ముఖ్యమంత్రిని మేము రెడ్డిగా కాదు బీసీ నేతగా చూస్తున్నామని పేర్కొన్నారు. అలాంటి లక్షణాలు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనను గౌడ్‌గా సంభోధించా అని వివరించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాటా అంత ఉండాలి అనే రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ఆచరణలో పేడుతున్నారని కొనియాడారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో పాపన్నగౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్  శంకుస్థాపన చేశారు. 

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. గాంధీ ఫ్యామిలీ మాట ఇస్తే అది శిలాశాసనమే. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశాం. అందులో తప్పులుంటే చూపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్‌ విసిరాం. తప్పులు చూపితే క్షమాపణ చెబుతామని చెప్పాం. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణను తప్పుపట్టవద్దు. దీన్ని తప్పుపడితే వందేళ్ల వరకు బహుజనులకు న్యాయం జరగదు. బీసీ రిజర్వేన్ల బిల్లును ఐదు నెలలుగా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ కలిపితే 70 శాతం వరకు చేరుతాయి. 

తెలంగాణలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం చట్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన చట్టం మనకు అడ్డంకిగా మారింది.’’ అని ముఖ్యమంత్రి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని  రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu