సీఎం జగన్ సమీప బంధువు అరెస్ట్.. వివేకా హత్య కేసు తేలేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన దగ్గరి బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ కు అత్యంత సమీప బంధువైన వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కడప జిల్లాలో సంచలనంగా మారింది .

కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో ఈనెల 8వ తేదీన పేలుడు సంభంవించింది. జిలెటన్ స్టిక్స్ పేలిన ఘటనలో పది మంది కూలీలు చనిపోయారు. పేలుడుకు బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్‌ మేనేజర్‌ రఘునాథరెడ్డిలను మరుసటి రోజే అరెస్ట్ చేశారు. మైనింగ్‌ పేలుడు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. తాజాగా ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సు దారుడు వైఎస్‌ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి స్వయానా పెదనాన్న. 

వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరుతో 2001 నవంబరులో మామిళ్లపల్లిలో మైనింగ్‌ లీజు జారీ కాగా.. నిర్వహణ హక్కులను బి.మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వర్‌రెడ్డికి 2013లో జీపీఏ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి భూగర్భ బెరైటీస్‌ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు వెల్లడైంది. అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వైఎస్ ప్రతాప్ రెడ్డికి పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. 

ఈ క్రమంలో వైఎస్ ప్రతాప్ రెడ్డి.. పులివెందులకు చెందిన యర్రగుడి రఘునాథరెడ్డికి పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లలో భద్రపరుచుకోవడానికే అగ్రిమెంటు ఇచ్చారు. ప్రతాప్ రెడ్డికి చెందిన లైసెన్సు మ్యాగజైన్లలో పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను అధిక లాభానికి లైసెన్సు లేని వారికి రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయిస్తూ వస్తున్నారు. 8న ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయించారు. వాటిని కలసపాడు మండలం, పోరుమామిళ్ల సమీపంలోని కొండగంగమ్మ మైనింగ్‌కు ఎలాంటి భద్రత లేని కారులో తీసుకొని వెళ్లి దించుతుండగా ఈ పేలుళ్లు జరిగాయి. పేలుడు కేసులో సీఎం సమీప బంధువు అరెస్ట్ కావడం  రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ కేసులానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును త్వరగా చేధించి నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులోనూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులపై తమకు అనుమానాలు ఉన్నాయని... వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పలు సార్లు చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కూడా ఆమె ఈ వివరాలు అందించారు.