చంద్రబాబుకి సమస్యలే సమస్యలు!

తెరాస ఉద్యమం కారణంగానో, కాంగ్రెస్ వ్యూహం కారణంగానో... ఆంధ్రప్రదేశ్ ఆగమఘాల మీద చీలిపోయింది. ఒక రాష్ట్రాన్ని ఎలా విభజించకూడదో అలా విభజించి చూపారు దిల్లీ పెద్దలు. అలాంటి కొత్త రాష్ట్రానికి రాజధాని దగ్గర నుంచీ రవాణా దాకా అన్నీ ఏర్పరుచుకోవలసిందే! అందుకోసం కేంద్రం నుంచి అద్భుతమైన సాయం లభిస్తుందంటూ ఎదురుచూసిన వారికి ‘ప్రత్యేక ప్యాకేజీ’లేవీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన దిల్లీ పెద్దలు నిండుమనసుతో ఆశీర్వదించారే కానీ, నిండైన ప్యాకేజీలు ఏవీ ప్రకటించలేదు. కొత్త రాజధానినీ, అందులో సచివాలయాన్ని ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే... అక్కడికి ఉద్యోగులని రప్పించడం మరో ఎత్తుగా ఉంది. హైదరాబాదు నుంచి అమరావతికి తరలివచ్చే విషయంలోనూ, తమకి జీతాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలోనూ... ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.

ఇక మొన్నటికి మొన్న వెలువడిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలలో తెదెపాకి ఘోర పరాజయమే మిగిలింది. ప్రత్యర్థులని మట్టికరిపించి నెం.1గా నిలుస్తామని ఊహించిన తెదెపా శ్రేణులు, 1 నెం. సీటుతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. దాంతో చంద్రబాబు తెలంగాణ మీద తగిన శ్రద్ధని చూపడం లేదనీ, ఆ విషయాన్ని గ్రహించిన ఓటర్లు తెదెపాను పక్కన పెట్టారనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాను ఎక్కడికీ వెళ్లలేదని చంద్రబాబు గ్రేటర్‌ ఓటర్లకు చెప్పినా... అలా చెప్పాల్సి రావడమే ఆయన పట్ల ఓటర్లకి ఉన్న అభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ విషయంలో చంద్రబాబు చురుకుగా లేకపోవడంతో, ప్రజలని ఎలా కన్విన్స్‌ చేయాలో అక్కడి క్యాడర్‌కి పాలుపోవడం లేదు. తెదెపా, తెలంగాణలో తిరిగి పుంజుకోవాలంటే చంద్రబాబు భారీ కసరత్తే చేయవలసి ఉంటుంది.

ఒక పక్క చంద్రబాబు రకరకాల సమస్యలతో సతమతం అవుతుంటే, గోరుచుట్టు మీద రోకటి పోటులా తుని సంఘటన వచ్చిపడింది. ఒక వర్గం తన కోసం రిజర్వేషన్లను సాధించుకునే క్రమంలో, ముద్రగడ దానికి ‘అనుకోకుండా’ ఉద్యమ నాయకుడైపోయారు. ఒక పక్క ఉద్యమాన్ని తనదైన శైలిలో నడిపిస్తూనే, చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు ముద్రగడ. ఉద్యమం పట్ల చంద్రబాబు సానుకూలంగా మారుతున్న కొద్దీ అది మరింత జటిలంగా మారడం రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇంతదాకా తగిన అవకాశం దక్కని జగన్‌కు కూడా ఈ ఉద్యమం బాగానే కలిసి వస్తున్నట్లుంది. మరి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు, ఇన్ని సమస్యలనూ ఒక్కసారిగా ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే!