తెలంగాణలో విద్య- ఇకనైనా బాగుపడేనా!

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత శాతం 66.5 శాతం. ఇదే కనుక వాస్తవమైతే మన దేశంలో బిహార్‌ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా తెలంగాణకంటే మెరుగైన అక్షరాస్యత ఉన్నట్లు లెక్క! ఈ దుస్థితికి కారణాలు చాలానే ఉండవచ్చు. ఇంటిల్లపాదీ కష్టపడితే తప్ప తిండి గింజలు దక్కని ప్రాంతాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. పిల్లలు సైతం పనిచేస్తే తప్ప మొలకెత్తిన బీడు భూములు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తాయి. వీటికి తోడు తరతరాలుగా విద్య పట్ల ఉండే నిస్తేజం, ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యం కూడా తెలంగాణలోకి నిరక్షరాస్యతకి ముఖ్యకారణాలే! అంధ్రప్రదేశ్ విభజన జరిగిన తరువాత అధికారాన్ని చేపట్టిన తెరాస ప్రభుత్వమన్నా ఈ పరిస్థితి గురించి కొంత దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయం.
 
వైద్యం, వ్యవసాయం మినహా మిగతా విద్యనంతా ఏకీకృతం చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అంత తేలికైంది కాదు. ఇప్పటికే పదుల కొద్దీ సంస్థలు తమకి అనుగుణమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నాయి. బి.సి.స్టడీ సర్కిళ్లు, కార్మిక సంక్షేమ శాఖ కింద నడిచే పాఠశాలలు, ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు... ఇలా ఒకో శాఖా ఒకో తరహాలో విద్యని నడిపిస్తోంది. వీటిలో చాలా సంస్థలు నిధులని ఖర్చుచేయడంలో చూపించే శ్రద్ధని విద్యని అందించడంలో చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ మీద సరైన నియంత్రణ లేకపోవడంతో ఆయా సంస్థల ఇష్టారాజ్యంగా విద్య సాగుతోంది.
 
కేవలం విద్యిను ఏకీకృతం చేయడంతోనే అంత ఉపయోగం ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యని బోధించే తీరు; పాఠశాలల్లోని పరిస్థితులు; ఉద్యోగ ఆధారిత విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క విద్యాసంస్థ తనకు అనుగుణమైన పాఠ్య పుస్తకాలను రూపొందించుకునేంత స్థాయిలో ఉంటోంది. ఆటస్థలాల వంటి సౌకర్యాల లేనిదే పాఠశాలలను నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ... కంటి ముందే అలాంటి సంస్థలు వందలు వేలుగా కనిపిస్తున్నాయి. ఆరో తరగతి నుంచే ఐ.ఐ.టి శిక్షణ అంటూ పిల్లల మీద మోయలేనంత భారం మోపే పరిస్థితులు ఉన్నాయి. ఏటా వేలాదిమంది గ్రాడ్యుయేట్లు పట్టాలను పట్టుకుని రోడ్డు మీదకు చేరుకుంటున్నారు. విద్యను వ్యాపారస్థాయి నుంచి విజ్ఞానపు స్థాయికి తీసుకురావల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. పిల్లలను అమెరికా పౌరులుగా కాకుండా మన దేశపు భావితరాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదా ఉంది. అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ విద్య ఎందుకు అవసరం? ఆ విద్య ఎలా ఉండాలి? విద్యతో తమ పిల్లలలో ఎలాంటి మార్పు రావాలి? అన్న విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటే రానున్న దశాబ్దాలలో తెలంగాణ దిగువ నుంచి కాకుండా ఎగువ నుంచి తొలిస్థానాలలో నిలుస్తుంది.