మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
posted on Apr 26, 2025 5:05PM
.webp)
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించారు. బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసేవారు ఇక్కడి వారే. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాను. నేనూ బటన్ నొక్కవచ్చు.. కానీ, మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలి. ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు.
దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు. రూ. 1990 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.