డ్రగ్స్‌ కేసు.. సెలబ్రిటీల పేర్లు మాయం

 

టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీ సెలబ్రెటీలు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్‌ బారిన పడుతున్నారని ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తులో తేలడంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు.. పలువురు సినీ సెలబ్రెటీలను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది.

అయితే తాజాగా..  ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. ఆయనకు అందిన సమాచారం ప్రకారం.. డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జిషీట్ల దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేశామని, సినీనటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. పలువురు సినీనటులు, దర్శకుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్ అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 12 కేసులను నమోదు చేసిన సిట్‌ అధికారులు సెలబ్రిటీలకు మాత్రం క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. అధికారులు దాఖలు చేసిన నాలుగు ఛార్జిషీట్లలో ఒకటి దక్షిణాఫ్రికా పౌరుడు రఫెల్‌ అలెక్స్‌ విక్టర్‌పై ఉంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ తరలిస్తున్నాడని అలెక్స్‌ విక్టర్‌ను ఆగస్టు 2017లో అరెస్టు చేశారు. అయితే అప్పట్లో అంత కలకలం రేపిన కేసు మరుగున పడటం, సెలబ్రిటీల పేర్లు మాయమవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.