కలరా కలవరపెడుతోందా!

 

ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా... రోగం అనే పదం మనిషిని ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఏదో ఒకవైపు నుంచి విరుచుకుపడుతూనే ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు చాలా మందులు ఉండవచ్చు కాక! కానీ నివారణను మించిన మార్గం లేనే లేదు. ఇప్పుడ కలరాదీ అదే పరిస్థితి! ఒకప్పుడు కలరా వ్యాపిస్తే లక్షలాదిమంది పిట్టల్లా రాలిపోయేవారు. మానవచరిత్రలో కలరా బారిన పడి చనిపోయినవారి సంఖ్య కోట్ల మీదే ఉంటుంది. కానీ అదృష్టవశాత్తూ ఇప్పుడు కలరాని ఎదుర్కొనేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అయినా కలరా గురించి తెలుసుకోవడమే, దాన్ని ఎదుర్కొనేందుకు తొలిమార్గం!

 

ఇదీ కారణం

 

మనుషులు తీసుకునే ఆహారంలో, మరీ ముఖ్యంగా మంచినీరులో ‘విబ్రియో కలరే’ అనే సూక్ష్మక్రిమి చేరడం వల్ల కలరా వ్యాపిస్తుంది. ఇది మన పేగులలో చేరి శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కలరా సోకిన మనిషిలో వాంతులు, విరేచనాలు, దాహం, గొంతు పొడిబారిపోవడం, కండరాల నొప్పులు, కడుపునొప్పి... ఇలా చాలా రకాలైన లక్షణాలు కనిపించవచ్చు. శరీర తత్వాన్ని బట్టి ఈ లక్షణాలు ఒక గంట నుంచి ఐదు రోజుల వరకూ ఎప్పుడైనా బయటపడవచ్చు. అలాగని కలరా సోకిన వారందరిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయనుకోవడానికి లేదు. ఎలాంటి లక్షణాలు లేనివారు తమకు తెలియకుండానే ఇతరులకు కలరాని అంటించే ప్రమాదం లేకపోలేదు.

 

వ్యాపించే తీరు!

 

కలరా సోకిన మనిషి మలమూత్రాల ద్వారా ఈ వ్యాధి చాలా త్వరితగతిన ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. నీటిలో కలిసి ఈ విసర్జితాలన ద్వారా కలరా వ్యాపిస్తుంది. మన ఇంట్లో తాగే నీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ హోటళ్లు, చిరుతిండి బళ్లు, బస్టాండుల వంటి ప్రదేశాలలో నీటి గురించి అంత శ్రద్ధ వహించే అవకాశం ఉండకపోవచ్చు. నీరు చల్లగా ఉండేందుకు వాడే ఐస్‌ ఏ నీటితో తయారుచేస్తున్నారో తెలియదు. మనం వాడే కూరగాయలు ఏ నీటిలో పండిస్తున్నారో తెలుసుకోలేం! ఆఖరికి పానీపూరీ వంటి పదార్థాలలో ఏ నీరు కలుస్తోందో చెప్పలేం! అందుకని కలరా గురించిన వార్తలు వినిపిస్తుంటే... తినే ఆహారం విషయంలోనూ, తాగే నీటి విషయంలోనూ వీలైనంత జాగ్రత్త వహించడం అవసరం.

 

ఎలాంటి జాగ్రత్తలు?

 

- పైపుల్లో వస్తున్న నీరు రంగుమారినట్లు కానీ, వాసనతో కానీ వస్తుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.

 

- కలరా వ్యాపించిందని తెలియగానే త్రాగునీటిని కాచి చల్లార్చి వడబోసి మాత్రమే తాగాలి. ముఖ్యంగా పిల్లలుండే ఇళ్లలో ఈ జాగ్రత్తను తప్పకుండా పాటించాలి.

 

- బయటకు వెళ్లేటప్పుడు ఒక బాటల్‌ నీటిని వెంట తీసకువెళ్లక తప్పదు. దీనివల్ల ఎక్కడ దాహం వేస్తే అక్కడి నీటిని తాగాల్సిన అగత్యం ఉండదు.

 

- బయట నుంచి వచ్చిన తరువాత కూడా కాళ్లూచేతులను శుభ్రంగా కడుక్కోవడం మరువకూడదు.

 

- వాంతులు, విరేచనాలు వంటి కలరాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించడం మంచిది. కలరాను కనుక నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.

 

- పళ్లు, కూరగాయలను వాడకానికి ముందు శుభ్రంగా కడగాలి. కలరా భయం తీరేంతవరకూ పళ్లు, కాయగూరలను చెక్కుతీసుకునే వాడుకోవాలి.

 

ఈ చర్యలతో కలరా ఆమడ దూరంలో ఉండిపోతుందని వేరే చెప్పనవసరం లేదు కదా!

 

- నిర్జర.