అయ్యబాబోయ్ ఏనుగులు...

 

చిత్తూరు జిల్లా ప్రజలని గత పదిహేను రోజులుగా ఏనుగులు హడలెత్తిస్తున్నాయి. అడవిలోంచి బయటకి వచ్చి పంట పొలాల మీద పడి చేతికొచ్చిన పంటని చక్కగా భోంచేస్తున్నాయి. కొంత భోంచేసి వెళ్ళిపోతే పర్లేదు గుంపులు గుంపులుగా పంట మీద పడి పంట మొత్తాన్నీ సర్వనాశనం చేసి మరీ పోతున్నాయి. ప్రజలు ఈ ఏనుగులు తమ మీద పడకుండా వుంటే చాలని బిక్కుబిక్కుమంటూ ఉండటం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. శుక్రవారం రాత్రి ఏనుగులు మరోసారి తమ విశ్వరూపం చూపించాయి. పంట పొలాల మీదపడి ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా, రైల్వే ట్రాక్ మీద సెటిలయ్యాయి. దాంతో రైల్వే సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో రైళ్ళను ఆ ట్రాక్ మీద నడపకుండా నిలిపేశారు. దాంతో చెన్నై - బెంగుళూరు మధ్య నడిచే అనేక రైళ్ళు నిలిచిపోయాయి. దాదాపు గంటసేపు ట్రాక్ మీదే తిష్ట వేసిన ఏనుగులు ట్రాక్ మీద నుంచి తప్పుకున్న తర్వాతే రైళ్ళను నడపటం ప్రారంభించారు. ఏనుగులా మజాకా...